నిండిన వరంగల్ జిల్లా కల్లెడ చెరువు
గ్రామం మునిగే అవకాశం ఉండడంతో అలర్ట్
అర్ధరాత్రి ఊరికి మరోవైపు గండి కొట్టించిన ఎస్ఐ వీరభద్ర రావు
ఐదు గంటలు శ్రమించిన ఆఫీసర్
వరంగల్/పర్వతగిరి, వెలుగు: అర్ధరాత్రి జోరువానలో కారుచీకట్లను లెక్కచేయకుండా 5 గంటలు శ్రమించి ఊరిని కాపాడాడో సబ్ ఇన్స్పెక్టర్. వరంగల్ జిల్లా కల్లెడ ఊర చెరువుపై కొన్ని రోజులుగా రోడ్డు పనులు జరుగుతుండగా..మరోవైపు తూములకు రిపేర్లు చేస్తున్నారు. కల్లెడలో బుధవారం 248 మి.మీ వర్షపాతం నమోదు కాగా పోలకమ్మ చెరువు, చుట్టుపక్క పొలాల నుంచి భారీగా వరద వచ్చింది. మరోవైపు భారీ వర్ష సూచనతో కల్లెడ చెరువుకు మత్తడి పడి గ్రామంలో సగం ఇండ్లు మునిగే ప్రమాదం ఏర్పడింది. దీంతో వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, సర్పంచ్ శోభ విషయాన్ని పర్వతగిరి ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావుకు తెలియజేశారు. దీంతో ఆయన రంగంలోకి దిగారు.
అర్ధరాత్రి వేళ 2 జేసీబీలతో 5 గంటలు శ్రమించి..
రాత్రి 12 గంటల సమయంలో ఎస్ఐ వీరభద్రం రెండు జేసీబీలు తెప్పించారు. ఊరికి అపోజిట్ డైరెక్షన్తో వరదనీరు బయటకు వచ్చినా పెద్దగా నష్టం ఉండదని భావించి బూరుగుమడ్ల వెళ్లేదారిలో చిన్న మత్తడి వద్ద ఉదయం 5 గంటల వరకు శ్రమించి గండి కొట్టించారు. నీరు కొంత తగ్గుముఖం పట్టాక గురువారం ఉదయం రెండు షట్టర్లు ఓపెన్ చేశారు. దీంతో ముప్పు తప్పడంతో గ్రామస్తులు ఎస్ఐ వీరభద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. విషయం తెలుసుకున్న వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్, ఇతర పోలీస్అధికారులు ఎస్ఐని అభినందించారు. గండం తప్పడంతో అధికారులు, ప్రజాపతినిధులు తవ్విన గండిని శుక్రవారం మళ్లీ పూడ్చారు.
ఊరు మునగొద్దని పట్టుదలతో ప్రయత్నించా
బుధవారం రాత్రి కల్లెడ చెరువు గండిపడి ఊరు మునిగిపోయే అవకాశముందని గ్రామ పెద్దలు నాకు సమాచారమిచ్చారు. అదే జరిగితే వందల ఇండ్లు మునిగిపోతాయి. అందుకే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చీకట్లోనే రెండు జేసీబీలు తీసుకువచ్చినం. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా పనులు మొదలుపెట్టాం. అంతా కలిసి పని చేయడంతో సక్సెస్అయ్యాం. గ్రామస్తులు, సీపీ సార్ ప్రశంసలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. -
ఇమ్మడి వీరభద్రరావు, పర్వతగిరి ఎస్ఐ