3.61 లక్షల వెహికల్స్ సేల్వెల్లడించిన సియామ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరు క్వార్టర్లో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 3.61 లక్షల యూనిట్లకు పెరిగి వార్షికంగా 1.87 శాతం వృద్ధి చెందాయి. ఏడాది క్రితం కాలంలో 3.55 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) విడుదల చేసిన నెలవారీ అమ్మకాల డేటా ప్రకారం.. 2022 సెప్టెంబరులో 17,35,19 లక్షల టూవీలర్లు అమ్ముడవగా, ఈసారి సెప్టెంబరులో టూవీలర్స్ విక్రయాలు 17,49,794 యూనిట్లుగా రికార్డయ్యాయి. టూ-వీలర్ విక్రయాలు తగ్గుతూనే ఉండటంపై సియామ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 2023 సెప్టెంబరులో త్రీవీలర్స్ అమ్మకాలు కూడా సంవత్సరానికి 50,626 నుంచి 74,418 యూనిట్లకు పెరిగాయి.
మొత్తం డిస్పాచ్‌లు( డీలర్లకు పంపినవి) 2022 సెప్టెంబర్లో 20,93,286 యూనిట్ల నుంచి గత నెలలో 21,41,208 యూనిట్లకు పెరిగాయి. ఇదేకాలంలో మొత్తం అమ్మకాలు 60,52,739 వెహికల్స్ నుంచి 61,16,091 వెహికల్స్‌కు పెరిగాయి. వెహికల్స్ తయారీలో ఉపయోగించే చిప్ సరఫరాకు సంబంధించి ప్రస్తుతం కొరత లేదని, భవిష్యత్తులోనూ ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేవని సియామ్ పేర్కొంది. ప్యాసింజర్ వెహికల్స్ డిస్పాచ్‌లు గత ఆర్థిక సంవత్సరం జులై–-సెప్టెంబర్ కాలంలో 10,26,309 యూనిట్ల నుంచి ఈ ఏడాది రెండో క్వార్టర్లో స్వల్పంగా పెరిగి 10,74,189 యూనిట్లకు చేరుకున్నాయి.
కమర్షియల్ వెహికల్స్ డిస్పాచ్‌లు గతేడాదితో పోలిస్తే 2,31,991 యూనిట్ల నుంచి 2,47,929 యూనిట్లకు పెరిగాయి. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 1,20,319 యూనిట్లతో పోలిస్తే రెండో క్వార్టర్లో మొత్తం త్రీవీలర్ల టోకు విక్రయాలు 1,95,215 యూనిట్లకు పెరిగాయి. మొత్తం టూవీలర్ డిస్పాచ్‌లు 2023 జులై–-సెప్టెంబర్‌లో 46,73,931 యూనిట్లు కాగా, గత ఏడాది కాలంలో 45,98,442 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మూడు విభాగాల్లోనూ వృద్ధి
2023–-24 రెండవ క్వార్టర్లో ప్యాసింజర్ వెహికల్స్, త్రీ-వీలర్లు, కమర్షియల్ వెహికల్స్ విభాగాలు వృద్ధిని సాధించాయని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు, అయినప్పటికీ టూవీలర్ హోల్‌సేల్ నంబర్లు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే స్వల్పంగానే వృద్ధిని నమోదు చేశాయి. "మనం పండుగ సీజన్‌లోకి వస్తున్నందున, పరిశ్రమలోని అన్ని విభాగాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడో క్వార్టర్లోనూ భారీ అమ్మకాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఆటోమొబైల్ రంగాలలో ఈ వృద్ధికి దేశ ఆర్థిక వృద్ధికి సంకేతమని చెప్పవచ్చు. అనుకూలమైన ప్రభుత్వ విధానాలు కూడా ఆటో అమ్మకాలు పెరగడానికి కారణం” అని అగర్వాల్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో, ఎస్‌యూవీలతో సహా యుటిలిటీ మోడళ్లకు బలమైన డిమాండ్ నేపథ్యంలో దేశంలో ప్యాసింజర్ వెహికల్స్ హోల్‌సేల్స్ సంవత్సరానికి 9 శాతం పెరిగాయి. డీలర్‌లకు మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ డిస్పాచ్‌లు 2022 ఆగస్టులో 3,28,376 యూనిట్ల నుంచి గత నెలలో 3,59,228 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి 1,81,825 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ రిపోర్టు పేర్కొంది.