కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావరచంద్ గెహ్లాట్ సిద్దరామయ్యను ఆహ్వానించారు. 2023, మే 18న కాంగ్రెస్ నేతలు సీఎల్పీ లీడర్ గా సిద్దరామయ్యను ఎన్నుకున్నారు . అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.
దీంతో సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ లను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటుగా పలు రాష్ట్రాల సీఎంలకు సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని కర్ణాటక కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజులు తరువాత సీఎం ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. సుదీర్ఘ చర్చల తరవాత కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యనే సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించింది. వీరితో పాటుగా పలువురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏర్పాట్లలో మునిగిపోయింది.
కాగా ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. 65 సీట్లు బీజేపీ గెలుచుకోగా 19 సీట్లతో జేడీఎస్ సరిపెట్టుకుంది.