కర్ణాటక క్రికెట్ దిగ్గజాల సేవలను గుర్తిస్తూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని స్టాండ్ల పేరు మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA)కు లేఖ రాశారు. స్టాండ్లకు గుండప్ప విశ్వనాథ్, ఎరపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్ పేర్లు పెట్టాలని సూచించారు.
చిన్నస్వామి స్టేడియంలోని స్టాండ్లకు కర్ణాటక క్రికెట్ దిగ్గజాల పేరు పెట్టాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇటీవల KSCAకు విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ చర్చ మొదలైంది. కర్ణాటక తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకున్న 1974లో గెలిచిన జట్టులో వారి పేర్లను గవాస్కర్ ప్రస్తావించారు. ఈరాపల్లి ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జావగల్ శ్రీనాథ్ వంటి దిగ్గజాల పేర్లను లిటిల్ మాస్టర్.. KSCA దృష్టికి తీసుకొచ్చారు.
రామచంద్ర గుహ లేఖ
ఇది జరిగిన కొన్నాళ్ళకు ఇదే విషయంపై మార్చి 29న చరిత్రకారుడు, ప్రముఖ రచయిత రామచంద్ర గుహ.. సిద్ధరామయ్యకు లేఖ రాశారు. మైదానంలో ఆట యొక్క స్ఫూర్తిని గొప్పగా నిలబెట్టిన క్రికెటర్ల పేర్లను స్టాండ్లకు పెట్టాలని KSCAని కోరాల్సిందిగా ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ఇతర ప్రదేశాలలో ఉన్న ప్రధాన క్రికెట్ స్టేడియాలు.. ఆయా రాష్ట్రాలలోని గొప్ప ఆటగాళ్ల పేర్లను కలిగి ఉన్నాయని ఆయన లేఖలో వివరించారు.
రాబోయే రాష్ట్ర క్రికెటర్లకు స్ఫూర్తి: సిద్ధరామయ్య
రామచంద్ర గుహ లేఖకు ప్రతిస్పందనగా, 1973-74లో కర్ణాటక రంజీ ట్రోఫీ విజయాన్ని సిద్ధరామయ్య ప్రస్తావిస్తూ, "అంతకుముందు పదిహేను సంవత్సరాల పాటు, బాంబే జట్టు రంజీ ట్రోఫీని గెలుచుకునేది. ఆ సంప్రదాయానికి తెరదించుతూ కర్ణాటక జట్టు తొలిసారి రంజీ ట్రోఫీని దక్కించుకుంది. ఆ విజయానికి కారణమైన ముగ్గురు గొప్ప క్రికెటర్లను గౌరవించమని అభిమానుల నుండి పదేపదే అభ్యర్థనలు వస్తున్నట్లు తెలిపారు. గుండప్ప విశ్వనాథ్, ఎరపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్ పేర్లు పెట్టాలని KSCAకు సూచించారు.
ఎవరీ ముగ్గురు..?
గుండప్ప విశ్వనాథ్, ఎరపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్ 90వ దశకంలో కర్నాటక అత్యుత్తమ క్రికెటర్లు. సొగసైన బ్యాటింగ్ శైలికి పేరుగాంచిన విశ్వనాథ్ 91 టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు. జాతీయ జట్టు కెప్టెన్‌గానూ ఉన్నారు. ఇక ప్రసన్న, చంద్రశేఖర్, ఇద్దరూ స్పిన్ బౌలర్లు. 1960, 1970లలో భారత జట్టు విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఏకంగా 431 టెస్ట్ వికెట్లు పడగొట్టారు.