Ranji Trophy: ఒక్కడే 9 వికెట్లు.. రంజీల్లో 24 ఏళ్ళ స్పిన్నర్ సంచలన బౌలింగ్

Ranji Trophy: ఒక్కడే 9 వికెట్లు.. రంజీల్లో 24 ఏళ్ళ స్పిన్నర్ సంచలన బౌలింగ్

రంజీ ట్రోఫీలో సంచలన స్పెల్ నమోదయింది. గుజరాత్‌ లెఫ్టార్మ్ ఆఫ్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ చెలరేగాడు. ఒక్కడే ఉత్తరాఖండ్ బ్యాటింగ్ లైనప్ ను చిత్తు చేశాడు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దేశాయ్ అద్భుత ప్రదర్శనతో ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు కుప్పకూలేలా చేశాడు. ఓవరాల్ గా దేశాయ్ 15 ఓవర్లలో 2.40 ఎకానమీ రేటుతో 36 పరుగులు మాత్రమే ఇచ్చి 9 వికెట్లు పడగొట్టడం విశేషం. 

మొదటి 9 వికెట్లు తీసుకున్న ఈ యువ స్పిన్నర్ పదో వికెట్ కూడా తీస్తాడనుకున్నారు. అయితే విశాల్ జైశ్వాల్ ఖాతాలో చివరి వికెట్ చేరింది. దీంతో 10 వికెట్లు తీసే అవకాశం సిద్ధార్థ్ చేజార్చుకున్నాడు. తొలి ఓవర్ నుంచే రంగంలోకి దిగిన అతను వరుసగా 15 ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. దీంతో  రాజస్థాన్ తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. అంతకముందు ఈ రికార్డ్ గుజరాత్ మాజీ లెఫ్టార్మ్ ఆఫ్ స్పిన్నర్ రాకేష్ ధ్రువ్ పేరిట ఉంది. అతను 31 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. 

ALSO READ | Riley McCullum: వారసుడు వస్తున్నాడు.. భారీ సిక్స్‌లు బాదేస్తున్న మెకల్లమ్ కొడుకు

సిద్ధార్థ్ దేశాయ్ విజృంభణతో ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖాండ్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. 35 పరుగులు చేసి ధాగ్వష్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. క్రీజ్ లో మనన్ హింగ్రాజియా (66),  జైమీత్ పటేల్(29) ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగుల ఆధిక్యంలో ఉంది.