సిద్ధార్థ్ హాస్పిటల్ ​ఆపరేషన్ థియేటర్​ సీజ్​

 సిద్ధార్థ్ హాస్పిటల్ ​ఆపరేషన్ థియేటర్​ సీజ్​

మియాపూర్, వెలుగు: హైదరాబాద్​ మియాపూర్ మదీనగూడలోని సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ ఆపరేషన్​థియేటర్​ను రంగారెడ్డి డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు సోమవారం సీజ్​చేశారు. ఇటీవల ఏపీలోని కడప జిల్లా నందనూరుకు చెందిన సుహాసిని(26) కండ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు సిద్ధార్థ్​న్యూరో హాస్పిటల్​లో అడ్మిట్​చేశారు.

చికిత్స పొందుతూ చనిపోగా, మూడు రోజుల పాటు అలాగే ఉంచి తమకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ట్రీట్​మెంట్​పేరుతో రూ.13 లక్షలు కట్టించుకున్నారని, బిల్లు కట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్​కు పంపించారన్నారు. అయితే అప్పటికే సుహాసిని చనిపోయిందని నిమ్స్​డాక్టర్లు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువతి డెడ్​బాడీతో శనివారం కుటుంబ సభ్యులు సిద్ధార్థ్ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. మూడు రోజుల కింద చనిపోతే తమకు సమాచారం ఇవ్వకుండా ట్రీట్​మెంట్​పేరుతో నాటకం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం రంగారెడ్డి డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు సిద్ధార్థ్​హాస్పిటల్​ను విజిట్​చేసి దర్యాప్తు చేపట్టారు.

సుహాసినికి ఎలాంటి చికిత్స చేశారు.. ఎలా చనిపోయింది.. మెడికల్ రిపోర్టులపై ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక దర్యాప్తులో భాగంగా హాస్పిటల్​ఆపరేషన్ థియేటర్ ను సీజ్ చేస్తున్నామని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం 28 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారని, వారిని మినహా కొత్తవారిని చేర్చుకోవద్దని ఆదేశించారు. విచారణలో సుహాసిని మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని తేలితే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను విచారించి రెండు రోజుల్లో చర్యలు చేపడతామన్నారు.