- చేర్యాలలో ఎమ్మెల్యే కూతురి భూమిని కాపాడేందుకు ఆఫీసర్ల యత్నం
- పేదల భూములు, ఓపెన్ ప్లాట్లకు ఎసరు
- వివాదస్పదమవుతున్న పెద్ద చెరువు మత్తడి నీళ్ల మళ్లింపు
- రైతులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే
- అడ్డుకున్న ఆయకట్టు రైతులు
- మా భూముల నుంచి కాల్వ తీస్తే ఊరుకోమని ఆందోళన
సిద్దిపేట/చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి నీళ్లను కుడి చెరువులోకి మళ్లించడానికి ఆఫీసర్లు చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారాయి. రైతులకు, ప్లాట్ల ఓనర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈనెల 19న మత్తడి కాల్వ నిర్మాణానికి కొత్త అలైన్మెంట్ఖరారు చేయడానికి సర్వేకు రాగా రైతులు అడ్డుకున్నారు. చేర్యాల పెద్ద చెరువు బఫర్ జోన్ లోని 1402 సర్వే నెంబర్లో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానిరెడ్డి 2,500 గజాల స్థలాన్ని కొన్నారు.
ఆ స్థలంలో దశాబ్దాలుగా పశువుల అంగడిని నిర్వహించడమే కాకుండా ప్రజా అవసరాలకు వాడుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే కూతురు పేరిట మూడేండ్ల కింద ఆ భూమిని కొని, ప్రహారీ కట్టించడంతో స్థానికులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక ప్లాన్ ప్రకారం ఆ స్థలాన్ని సొంతం చేసుకున్న ఎమ్మెల్యే, మత్తడి నుంచి వచ్చే నీటితో తమ స్థలానికి ముంపు ప్రమాదం రాకుండా కాల్వ నిర్మించాలనే ప్రపోజల్ ముందుకు తెచ్చారు. మత్తడిపై నుంచి నీరు బయటకు రాగానే నేరుగా ముందుకు వెళ్లాల్సి ఉండగా దాన్ని ‘యూ’ ఆకారం మళ్లించి కాల్వ నిర్మాణాన్ని కొంత దూరం చేపట్టి వదిలేశారు.
ముందస్తు సమాచారం లేకుండా సర్వే
కొత్త అలైన్మెంట్ఖరారు కోసం పెద్ద చెరువు ఆయకట్టు రైతులకు ముందస్తు సమాచారం లేకుండా ఆఫీసర్లు నేరుగా రంగంలోకి దిగి సర్వే చేపట్టారు. అలైన్మెంట్ప్రకారం ఆయకట్టు కింది రైతులకు చెందిన భూముల్లో కొంత మేర చదును చేసే పనులు ప్రారంభించగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిలిపివేశారు. ఓపెన్ మార్కెట్లో ఎకరం భూమి కోటి రూపాయలు పలుకుతుండడంతో ఎమ్మెల్యే భూమిని కాపాడేందుకు పేద రైతుల భూములు సేకరిస్తారా.. అని ప్రశ్నించారు. 20 మంది పేద రైతుల భూమితో పాటు పేదలకు చెందిన 40 ఓపెన్ ప్లాట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
కాల్వ నిర్మాణానికి నిధుల మంజూరు..
కొత్త అలైన్మెంట్ తో 400 మీటర్ల మేర మత్తడి కాల్వ నిర్మాణానికి రూ. 3 కోట్లు శాంక్షన్ కావడంతో ఆఫీసర్లు సర్వే పనులు మొదలుపెట్టారు. గతంలో పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ కోసం కేటాయించిన ఫండ్స్‌తో 400 మీటర్ల కాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయగా ప్రస్తుత రూ.3కోట్లతో కాల్వ పనులు ప్రారంభించడానికి ఆఫీసర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు కిలో మీటర్ మేర కాలువను 12 ఫీట్ల వెడల్పు, ఆరు ఫీట్ల లోతుతో పేదల భూముల గుండా నిర్మించాలని ప్రపోజ్ చేశారు.
పేద రైతుల పొట్ట కొట్టొద్దు
కాల్వ పేరిట పెద్ద చెరువు ఆయకట్టు కింద ఉన్న పేద రైతుల పొట్ట కొట్టొద్దు. పెద్దల భూములు కాపాడేందుకు పేద రైతుల భూముల్లోంచి కాల్వ తీయాలని ప్రయత్నిస్తున్నరు. కాల్వ కోసం మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. తాత ముత్తాతల నుంచి ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నం.. కాల్వ తీసి మమ్మల్ని బతకకుండా చేసి బజార్న పడేస్తారా.
- బుట్టి భిక్షపతి, రైతు, చేర్యాల
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే..
పెద్ద చెరువు మత్తడి నీళ్లను కుడి చెరువుకు మళ్లించడానికి ఇప్పటికే కొంత భాగం కాల్వ నిర్మించాం. కాల్వ కొత్త అలైన్మెంట్ సర్వే చేసి మరో నాలుగు వందల మీటర్ల మేర కాలువ నిర్మాణం చేపట్టనున్నాం. రైతుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం.
- నర్సింలు, ఇరిగేషన్ ఏఈ చేర్యాల