
గజ్వేల్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ను గవర్నర్ బర్తరఫ్ చేయాలని సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ తూంకుంట నర్సారెడ్డి డిమాండ్చేశారు. ఆయన ఆధ్వర్యంలో కేసీఆర్ చర్యలను వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరు బాట పాదయాత్రలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా కొడకండ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసమస్యలు పట్టని, మల్లన్న సాగర్ నిర్వాసితులను నిండా ముంచిన కేసీఆర్కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా పోరుబాట చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆర్అండ్ఆర్ కాలనీలను ఆదర్శ కాలనీ అన్న కేసీఆర్, హరీశ్ రావు అక్రమాల ఫలితంగా జనం చస్తే బొంద పెట్టేందుకు స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా15 నెలలుగా అందుబాటులో లేని కేసీఆర్ రూ. 58 లక్షల జీతం ఎలా తీసుకుంటారని నిలదీశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అంక్షారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు, కార్యదర్శి రాములు గౌడ్, నాయకులు అంజి యాదవ్, రమేశ్ గౌడ్, సారిక, అస్గర్, అజహర్, రాజశేఖర్ రెడ్డి, సమీర్ పాల్గొన్నారు.