బీసీలకు టికెట్లు దక్కేనా...కాంగ్రెస్ , బీజేపీలో ఆశావహులు

బీసీలకు  టికెట్లు దక్కేనా...కాంగ్రెస్ , బీజేపీలో ఆశావహులు

సిద్దిపేట, వెలుగు :  రానున్న ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో బీసీ లీడర్లకు టికెట్ల పై స్థానికంగా చర్చ మొదలైంది. ప్రధాన పార్టీల్లో బీసీ నేతలు టికెట్లు ఆశిస్తుండగా.. అధికార పార్టీలో మాత్రం ఆ అవకాశం లేదు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం ఓసీ లీడర్లే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో బీసీ నేతలు సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు.  సిద్దిపేట నుంచి హరీశ్​ రావు, గజ్వేల్ నుంచి కేసీఆర్, హుస్నాబాద్ నుంచి సతీశ్​ కుమార్​ పోటీ లో ఉండటం పక్కా . మరోవైపు దుబ్బాక నుంచి కొత్త ప్రభాకరెడ్డికి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బీఆర్​ఎస్​లో బీసీలకు టికెట్లు దాదాపూ లేనట్టే. బీసీలకు ఎన్నికల్లో దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నా .. జిల్లాలో   పోటీ చేసే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. 

సిద్దిపేట కాంగ్రెస్​లో బీసీల మధ్యే పోటీ.. 

సిద్దిపేట నియోజకవర్గంలో  కాంగ్రెస్ లో బీసీ నేతల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది. ఈ సెగ్మెంట్​ కాంగ్రెస్ టికెట్టుపై దర్పల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్ గౌడ్, పూజల హరికృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తాడురి శ్రీనివాస్ గౌడ్ గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా , దర్పల్లి చంద్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా పూజల హరికృష్ణ తొలిసారి టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈసారి సిద్దిపేటలో కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థే పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ కౌన్సిలర్ చొప్పదండి విద్యాసాగర్ మరోసారి టికెట్​ ఆశిస్తున్నారు. ఇటీవలే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులై ఆయన టికెట్​పై ధీమగా ఉన్నారు. 

మిగిలిన మూడు చోట్ల ఒక్కొక్కరే

సిద్దిపేట మినహా జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అటు కాంగ్రెస్, ఇటు బీజెపీ ల నుంచి బీసీ నేతలు ఒక్కొ క్కరే టికెట్ల ప్రయత్నాల్లో ఉన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి కత్తి కార్తీక, గజ్వేల్లో బీజేపీ నుంచి నందన్ గౌడ్, హుస్నాబాద్ లో బీజేపీ నుంచి శ్రీరాం చక్రవర్తి టికెట్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు కూడా ఇటీవలి కాలంలో వినిపిస్తోంది. అయితే బీసీ నేతలకు ఆయన  పార్టీలు ఎంతవరకూ  అవకాశం ఇస్తాయో  చూడాల్సిందే.. 

 ద్వితీయ శ్రేణి నాయకత్వ లేమి...

నాలుగు నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లే ఎక్కువ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ద్వితీయ శ్రేణిలో బీసీ నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ నేతలకు ఆశించిన స్థాయిలో రాజకీయ అవకాశాలు అందడం లేదని పలువురు అంటున్నారు. అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షాలైన బీజెపీ, కాంగ్రెస్ లో సైతం బలమైన బీసీ నేతలకు సరైన అవకాశాలు దక్కడం లేదనుకుంటున్నారు.