
- ముగ్గురు ఎంపీల భవిష్యత్ ను నిర్ణయించేది ఈ జిల్లానే
సిద్దిపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాకు ఒక స్పెషాలిటీ ఉంది. జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. మొత్తం 26 మండలాలు ఉండగా ఇందులో కొన్ని మెదక్, కరీంనగర్, భువనగిరి పార్లమెంట్ స్థానాల పరిధిలోకి వస్తాయి. జిల్లాలో ని18 మండలాలు మెదక్ పార్లమెంట్పరిధిలోకి, కరీంగనర్, భువనగిరి పరిధిలో నాలుగేసి మండలాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయిన బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలు కరీంగనర్ ఎంపీ స్థానం పరిధిలోకి , వరంగల్ జిల్లా నుంచి విడిపోయిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండలాలు భువనగిరి ఎంపీ స్థానం పరిధిలోకి, మిగిలిన మండలాలు మెదక్ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తాయి.
దీంతో ఆయా ఎంపీ స్థానాల పరిధిలోని రిటర్నింగ్ ఆఫీసర్లు తమ పరిధిలోకి వచ్చే మండలాల ను పర్యవేక్షిస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానం పరిధి లోకి వచ్చే 18 మండలాల్లో 7,25,199 మంది ఓటర్లుండగా పోలింగ్ కోసం 1009 బూత్ లను ఏర్పాటు చేశారు. భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో ఒక మున్సిపాలిటీ, నాలుగు మండలాల్లో మొత్తం 90,651 మంది ఓటర్లుండగా 102 పోలింగ్ బూత్ లు, కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1,34,565 మంది ఓటర్లుండగా 174 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.
మహిళా ఓటర్లే అధికం
సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్, కరీంనగర్, భువనగిరి ఎంపీ స్థానాల పరిధిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 18 మండలాల్లో 13,855 మంది, కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలో 2,036 మంది, భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో 899 మంది పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ మూడు స్థానాల పరిధిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నప్పటికీ మూడు పొలిటికల్ పార్టీలు మాత్రం మహిళలకు టికెట్ కేటాయించలేదు.
రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండింట్లో మాత్రమే మూడు పొలిటికల్పార్టీల క్యాండిడేట్లు ఖరారయ్యారు. మెదక్ , భువనగిరి స్థానాల నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా కరీంనగర్ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాలేదు. కరీంనగర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వినోద్ రావు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇప్పటికే బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్, అక్కన్న పేటలో పర్యటనలు ప్రారంభించారు.
భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాత్రమే ఇటీవల కొమురవెల్లి, చేర్యాల, మద్దుపు, ధూల్మిట్ట మండలాల్లో పర్యటించగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనా ఇప్పటి వరకు ఎలాంటి పర్యటనలు చేయలేదు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తుండగా మెదక్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు ఇంకా ప్రచార పర్వంలోకి అడుగుపెట్టలేదు.
ఊపందుకోని ప్రచారాలు
పార్లమెంట్ఎన్నికల నామినేషన్లకు ఇంకా పక్షం రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ పొలిటికల్పార్టీల ప్రచారాలు ఊపందుకోలేదు. ఇప్పటికే ప్రధాన పార్టీల క్యాండిడేట్స్ ఖరారైనా కేవలం కార్యకర్తల సమావేశాలకే అభ్యర్థులు పరిమితమయ్యారు. కరీంగనగర్ బీజేపీ క్యాండిడేట్బండి సంజయ్ మాత్రం జనహిత యాత్ర పేరిట జిల్లా పరిధిలోని నాలుగు మండలాల్లో పర్యటించగా ప్రధాన పార్టీల క్యాండిడేట్స్ఇంకా క్షేత్ర స్థాయిలో ప్రచారం మొదలు పెట్టలేదు.