హుస్నాబాద్,వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆదివారం బస్సును ఓవర్టేక్చేయబోగా కారు బోల్తా పడి ఓ బాలుడు చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం..హుస్నాబాద్‌కు చెందిన ఎగ్గోజు రిశ్వంత్(17) హనుమకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వడంతో హుస్నాబాద్వచ్చాడు. ఆదివారం తన క్లాస్మేట్స్అజయ్, వెంకటేశ్, అఖిల్‌తో కలిసి కారులో కరీంనగర్ వెళ్లాడు.
మధ్యాహ్నం తిరిగి వస్తుండగా హుస్నాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయాడు. కారు ఓవర్ స్పీడ్‌లో ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపై కొంతదూరం పల్టీలు కొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడిపిస్తున్న రిశ్వంత్అక్కడికక్కడే చనిపోయాడు. కారులో ఉన్న అజయ్, వెంకటేశ్, అఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. రిశ్వంత్..ఓవర్‌స్పీడ్‌తో పాటు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.