
హుస్నాబాద్, వెలుగు : తమ పదవీకాలాన్ని మరో రెండేండ్లు పొడిగించాలని పలువురు సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. తాము ఎన్నికయ్యాక ఎనిమిది నెలలు గడిచిపోయినా చెక్‌పవర్ ఇవ్వలేదని, వరుసగా వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ ఎన్నికలు, కరోనా కల్లోలంతో రెండేండ్లు వృథాగా ఉన్నామన్నారు. దీనికి తోడు ఎస్ఎఫ్సీ, సీఎఫ్‌సీ నిధులు ఏండ్లతరబడి రాలేదని, అప్పులు చేసి పనులు చేసినా బిల్లులు ఇవ్వలేదన్నారు. తమ పదవులను మరో రెండేండ్లు పొడిగిస్తే జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటామన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరు
చౌటపల్లి, కేశనాయక్‌తండా తదితర గ్రామాల సర్పంచులు జిల్లెల అశోక్‌రెడ్డి, గద్దల రమేశ్, రవీందర్ ఎంపీడీవో సత్యపాల్రెడ్డికి వినతిపత్రాన్ని ఇచ్చారు. 2019 ఫిబ్రవరి 2న తాము సర్పంచులుగా ఎన్నికైతే 2019 అక్టోబర్ 10 వరకు చెక్‌పవర్ ఇవ్వలేదన్నారు. నెల నెలకు నిధులు జమ కాకపోవడం, మెయింటనెన్స్ నిధులు కూడా రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ పెండింగ్ నిధులు వచ్చే వరకు తమ పదవీకాలాన్ని మరో రెండేండ్లు పొడిగించాలని కోరారు.
బయటపడిన భర్తల పెత్తనం
పదవి ఆమెది..పెత్తనం ఆయనదని అక్కన్నపేట ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి సాక్షిగా బయటపడింది. సర్పంచుల పదవీకాలాన్ని పెంచాలని ఎంపీడీవోకు వినతిపత్రాన్ని ఇచ్చినవారిలో సర్పంచుల భర్తలు ఉన్నారు. పోతారం(జే), గండిపల్లి, మైసమ్మవాగుతండా, జనగామ సర్పంచులకు బదులు వాళ్ల భర్త, మామ, కొడుకులు ప్రభుత్వ ఆఫీసుకు వచ్చి సర్పంచులుగా వ్యవహరించారు. గత ప్రభుత్వ పాలనలోనూ వీళ్లంతా అనధికారిక సర్పంచులుగా వ్యవహరించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినా ఇదే సీన్ కనిపించడంతో పలువురు విమర్శిస్తున్నారు.