
తొగుట, వెలుగు : అశ్లీల వీడియోలు, ఫొటోలు ఎరగా వేసి యువతను మోసం చేసిన ఎనిమిది మంది సైబర్ నేరగాళ్లను సిద్దిపేట జిల్లా బేగంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గజ్వేల్ ఏసీపీ రమేశ్, తొగుట సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన బేగంపేట పోలీసులు దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన నలుగురు, మహమ్మద్ షాపూర్ కు చెందిన మరో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారు యువతే టార్గెట్గా అశ్లీల వీడియోలు, ఫొటోలు ఎరగా వేసి అందినకాడికి వసూళ్లకు పాల్పడుతున్నట్లు, ఆ సొమ్ముతో జల్సాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 11 ఫోన్లు, 19 సిమ్ కార్డులు, ఏడు బ్యాంక్ పాస్ బుక్స్, ఏడు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 19 వేల ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానితుల నుంచి న్యూడ్ వీడియో కాల్స్ గానీ, వీడియో చాట్ గానీ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు.