
- భూములు తిరిగి ఇవ్వాలని కోరుతున్న కొంతమంది రైతులు
- నిధుల లేమితో ఇవ్వలేకపోతున్నామని చెబుతున్న అధికారులు
సిద్దిపేట/బెజ్జంకి, వెలుగు: టీజీఐఐసీకి భూములిచ్చిన రైతులు ఏడాదిన్నరగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని 124 సర్వే నెంబర్ లో ఉన్న 330 ఎకరాలను 225 మంది రైతుల నుంచి టీజీఐఐసీ నాలుగేళ్ల కింద సేకరించింది. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడానికి రైతులతో ఒప్పందం చేసుకుంది. 160 మంది రైతులకు మూడు విడతలుగా పరిహారం అందజేసింది.
మిగిలిన 65 మంది రైతులకు పరిహారం అందజేయడానికి సన్నాహాలు చేస్తుండగానే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో 70 ఎకరాల పరిహారం చెల్లింపు కోసం 65 మంది రైతులు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్నారు. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. లేదంటే భూములైనా వెనక్కి ఇవ్వాలని డిమాండ్చేస్తున్నారు.
ఖాళీగా టీజీఐఐసీ భూములు
దాచారం గ్రామ రైతుల నుంచి టీజీఐఐసీ సేకరించిన భూములు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. నాలుగేళ్ల కింద సేకరించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతారని భావించినా ఇప్పటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. గతంలో ఈ భూముల్లో వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటుచేస్తారనే ప్రచారం సాగినా ఎలాంటి ప్రగతి లేదు. రైతుల నుంచి సేకరించిన భూమిచుట్టూ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేయలేదు. స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా పరిశ్రమలు నెలకొల్పాలని స్థానికులు కోరుతున్నారు.
నిధులు రాగానే పరిహారం చెల్లింపు
ప్రభుత్వం నుంచి నిధులు రాగానే టీజీఐఐసీకి సేకరించిన భూముల పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు70 ఎకరాలకు సంబంధించి 60 మంది రైతులకు పరిహారాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే వారికి పరిహారం అందే విధంగా ప్రయత్నిస్తాం.
ఉట్కూరి శ్రీనివాసరెడ్డి, తహసీల్దారు, బెజ్జంకి
రేపుమాపంటు తిప్పుతున్నరు
టీజీఐఐసీకి మూడెకరాలు తీసుకుని పరిహారం విషయంలో రేపు మాపంటూ తిప్పుతున్నరు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ డబ్బులు చేతికి రాలేదు. నిధులు లేవని అధికారులు చెబుతుండ్రు.
ధీటి రాజు, రైతు, దాచారం