దుద్దెడ నుంచి సిరిసిల్ల హైవేకు అడ్డంకులు.. పచ్చని పంట పొలాల గుండా నేషనల్ హైవే

దుద్దెడ నుంచి సిరిసిల్ల హైవేకు అడ్డంకులు.. పచ్చని పంట పొలాల గుండా నేషనల్ హైవే
  • భూ సేకరణసర్వేను అడ్డుకుని రైతుల నిరసన
  • 365బీ ఎక్స్​టెన్షన్​ పనులకు ఆటంకం
  • పచ్చని పంట పొలాల గుండా నేషనల్ హై వే

 సిద్దిపేట, వెలుగు: దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 365బీ నేషనల్​ హైవే ఎక్స్​టెన్షన్ పనుల కోసం భూ సేకరణపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలైన్​మెంట్ మార్పు పై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. పరిహారం తేల్చకుండా నేషనల్​ హై వే అథారిటీ అధికారులు భూ సేకరణ కోసం మార్కింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు దుద్దెడ, చిన్న గుండవెల్లి తదితర గ్రామాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న తొమ్మిది గ్రామాల రైతులు సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. 

పొలాలను కాపాడడానికి హైవే వెడల్పు తగ్గించాలని, అవసరమైతే అలైన్​మెంట్​ మార్చాలని కోరుతున్నారు. అలాకాని పక్షంలో గ్రామసభ నిర్వహించి పరిహారం సంగతి తేల్చాలని, ఆతర్వాతే మార్కింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మార్కింగ్ చేసిన తర్వాతే రెవెన్యూ అధికారులు భూ సేకరణ కోసం చర్యలు ప్రారంభిస్తారని నేషనల్​ హైవే ఆఫీసర్లు చెప్తున్నారు. రైతుల ఆందోళనతో ప్రస్తుతానికి సర్వే నిలిచిపోయింది. 

రెండు ప్యాకేజీల్లో హై వే పనులు

జనగామ నుంచి దుద్దెడ క్రాసింగ్​వరకు 365బీ నేషనల్​ హై పనులు పూర్తయ్యాయి. రాజీవ్ రహదారి దుద్దెడ క్రాసింగ్ నుంచి సిరిసిల్ల వరకు 54 కిలోమీటర్ల 365బీ హైవే ఎక్స్​టెన్షన్​ పనులు రూ. 1100 కోట్ల తో చేపడుతున్నారు. ఈ హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు.

 దుద్దెడ నుంచి మల్యాల వరకు 27 కిలో మీటర్లు మొదటి ప్యాకేజీ, మల్యాల నుంచి సిరిసిల్ల వరకు 27 కిలో మీటర్ల హైవేను రెండో ప్యాకేజీగా చేపడుతున్నారు. మొదటి ప్యాకేజీ కోసం రైతుల నుంచి దాదాపు 30 నుంచి 50 ఎకరాలు సేకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల క్షేత్ర స్థాయిలో సర్వేను ప్రారంభించారు. ప్యాకేజీ 1 కింద దుద్దెడ నుంచి మర్పడ్గ, ఘనపూర్, ఎన్సాన్ పల్లి, బూర్గుపల్లి , చిన్నగుండవెల్లి, మల్యాల వరకు 150 ఫీట్ల రోడ్డు కోసం పచ్చని పంటపొలాల్లో మార్కింగ్ చేయడం ప్రారంభించారు. ఇక్కడ భూముల విలువ భారీగా ఉండడంతో వాటిని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. పోలీసు పహారాలో రెండు రోజుల కింద జరిగిన మార్కింగ్​ ప్రక్రియను ఏడు గ్రామాల రైతులు అడ్డుకున్నారు. 

మార్కెట్​ రేటు ఇవ్వాలని డిమాండ్​ 

భూసేకరణ తప్పనిసరి అయితే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైవే నిర్మాణం జరిగే ప్రాంతాల్లో ఎకరం రేటు రూ. 60 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉందని, కానీ ప్రభుత్వం రూ. 18 లక్షల పరిహారం చెల్లించే అవకాశం వుందని రైతులుఅంటున్నారు. ముందుగా రైతులకు నోటీసులు ఇచ్చి మార్కెట్​ రేటు ఇస్తామని హామీ ఇవ్వాలని, అలా అయితేనే తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. 

 అలైన్​మెంట్​ మార్పు కష్టమే 

మొదటి ప్యాకేజీ హైవే అలైన్​మెంట్​ మార్చాలన్న రైతుల డిమాండ్ పెండింగ్ లోనే ఉంది. రెండు నెలల కింద కలెక్టరేట్​లో జరిగిన సమావేశంలో రైతులు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రతిపాదించగా వాటిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో హైవే అధికారులు పాత అలైన్మెంట్ ప్రకారం మార్కింగ్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే ప్రత్యామ్నాయాల గురించి పరిశీలిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలైన్​మెంట్​ మార్పు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎకరన్నర భూమి పోతుంది

నేషనల్​ హైవే కింద విలువైన ఎకరన్నర భూమిని కోల్పోతున్న. ఇప్పటి వరకు అలైన్​మెంట్​ మారుతుందని అనుకున్నా. అధికారులు పాత అలైన్​మెంట్​ ప్రకారమే మార్కింగ్ చేస్తున్నారు. భూముల విలువను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మానవతా ధృక్ఫథంతో వ్యవహరించాలి. మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలి. హై వే వెడల్పును తగ్గిస్తే రైతులకు కొంత మేలు జరుగుతుంది. పంజా చిరంజీవి, రైతు, జప్తి నాచారం