సిద్దిపేట, వెలుగు: మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల15న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి రిబ్బన్ కట్ చేయనున్నారు. ఈ సందర్భంగా 10 వేల మంది యువకులతో సభ నిర్వహించనున్నారు. పట్టణ శివారులోని నాగుల బండ వద్ద మూడెకరాల స్థలంలో రూ. 52 కోట్ల వ్యయంతో 718 సీటింగ్ కెపాసిటీతో దీన్ని నిర్మించారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేయగా సిద్దిపేట కూడా వాటి సరసన చేరనుంది.
వెయ్యి మందికి జాబ్స్
సిద్దిపేటలో ఏర్పాటు చేస్తున్న ఐటీ టవర్ ద్వారా ప్రత్యక్షంగా1000 మందికి, పరోక్షంగా మూడునాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మొదటి దశలో 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులోభాగంగానే ఓఎస్ఐ డిజిటల్, జోలాన్ టెక్, విసన్ ఇన్ఫో టెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసోల్, థోరాన్ టెక్నాలజీస్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్ తో పాటు మరిన్ని ప్రముఖ కంపెనీలు అగ్రిమెంట్లు చేసుకున్నాయి.
ఐటీ కంపెనీలకు ఉచిత సౌకర్యాలు
సిద్దిపేట ఐటీ టవర్‌లో భాగస్వాములయ్యే కంపెనీలకు ప్రభుత్వం రెండేళ్ల పాటు ఉచిత సౌకర్యాలను కల్పించనుంది. ఆఫీసుల నిర్వహణ, అద్దె, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లుల భారం లేకుండా చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. దీంతో పలు కంపెనీలు ముందుకు రాగా.. జిల్లాలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఈ మేరకు కంపెనీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఏర్పాట్లు చేస్తోంది. 45 రోజులకు ఒక బ్యాచ్ లెక్కన ప్రతి బ్యాచ్‌లో 150 మందికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
రేపు మెగా జాబ్ మేళా
ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధం కావడంతో అందులో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం పోలీస్ కన్వన్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ ఐటీ శాఖ, టాస్క్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొననున్నాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ , బీఎస్పీ కంప్యూటర్స్ విద్యార్హత అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.