భార్యను చంపాలని చూసిన భర్తకు నాలుగేండ్ల జైలు శిక్ష

సిద్దిపేట రూరల్, వెలుగు: మద్యానికి బానిసై, పైసల కోసం భార్యను చంపాలని చూసిన భర్తకు నాలుగేండ్లు జైలు శిక్ష పడింది. ఎస్సై కిరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్​ మండలంలోని చిన్న గుండవెల్లికి చెందిన మస్కూరి మల్లేశం 11 ఏండ్ల కింద అదే గ్రామానికి చెందిన భాగ్యను పెండ్లి చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత తాగుడుకు బానిసైన మల్లేశం డబ్బు కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

ALSO READ:ఓపెన్​ సిట్టింగులో కుర్చీ కోసం కొట్టుకున్నరు

2019 మే 31న రాత్రి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని భాగ్యతో గొడవపడ్డాడు. తన దగ్గర లేవని చెప్పగా, ఆమెను చితకబాదాడు. చీరతో మెడకు బిగించి, కత్తితో పొడిచాడు. అత్తమామలు, మరదలు గమనించి భాగ్యను హాస్పిటల్​కు తరలించారు. తర్వాత బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మల్లేశంను రిమాండుకు తరలించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరగగా, నేరం రుజువుకావడంతో జడ్జి స్వాతిరెడ్డి మల్లేశంకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.1000 ఫైన్ విధించారు.