పార్టీ మారిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు పక్కా : హరీశ్ రావు

పార్టీ మారిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు పక్కా : హరీశ్ రావు
  • సుప్రీంను ఆశ్రయించి డిస్​క్వాలిఫై చేయించేదాకా నిద్రపోం : హరీశ్ 
  • ఆరునూరైనా మళ్లీ బీఆర్ఎస్​దే అధికారమని కామెంట్

సంగారెడ్డి, వెలుగు : కాంగ్రెస్ పార్టీలోకి మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేంతవరకు నిద్రపోమని అన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు పోయి వారిని డిస్​క్వాలిఫై చేయించేదాకా పోరాడుతామని చెప్పారు.

బుధవారం సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీకి కష్టాలు వస్తాయని, ఎమ్మెల్యేలు పోయినంతమాత్రాన పార్టీ పోదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. 

రుణమాఫీపై రోజుకో మాట

రైతుల రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట చెబుతుందని హరీశ్ రావు విమర్శించారు. జీవోలో రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ అని చెప్పారన్నారు. వ్యతిరేకత వస్తోందని మాట మార్చి ఇప్పుడు పాస్ బుక్ ఉంటే సరిపోతుందని సీఎం రేవంత్ కేవలం నోటి మాటగా చెప్పడం సరికాదన్నారు. అదే నిజమైతే రైతు రుణమాఫీపై విడుదల చేసిన జీవోను మార్చాలని డిమాండ్ చేశారు.

వడ్లకు బోనస్ అని చెప్పి తర్వాత సన్నవడ్లకే బోనస్ అంటూ 90 శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టారన్నారు. ఇప్పుడు రుణ మాఫీ విషయంలోనూ అదే చేస్తున్నారని అన్నారు. పీఎం కిసాన్ నిబంధనలు..రేషన్ కార్డు నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు, మెట్టు కుమార్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

హరీశ్ మెడలో టీఆర్ఎస్ కండువా

బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించింది. పటాన్ చెరులో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన బీఆర్ఎస్ కండువాకు బదులు టీఆర్ఎస్ కండువా వేసుకోవడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్​గా మార్చబోతున్నారని చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన ఈ రకంగా కండువా వేసుకోవడం గమనార్హం.