- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
చండూరు/ నల్లగొండ అర్బన్, వెలుగు : మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం భువనగిరి లోక్ సభ అభ్యర్థి క్యామ మల్లేశ్ ను గెలిపించాలని కోరుతూ నల్లగొండ టౌన్, చండూరు మండల కేంద్రంలో హరీశ్‌రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థం కోసం నాయకులు పార్టీలు మారొచ్చు కానీ..
పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు గాల్లో నడుస్తున్నారని, వారిని భూమి మీద నడిచేటట్టు చేయాలంటే కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్‌విసిరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీటీసీ వెంకటేశం, మాజీ గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, ఎంపీపీ అవ్వారి గీతాశ్రీనివాస్, పాల్వాయి స్రవంతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.