
బెజ్జంకి, వెలుగు : ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ. 2 లక్షల రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, పెన్షన్, రైతు బంధు రూ. 15 వేలు, కౌలు రైతుకు రూ. 12 వేలు, ఆడపిల్లకు స్కూటీ వంటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రూ. 1800 ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని, కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం చేశారు. జీఎస్టీతో కేంద్రం పేదల నడ్డి విరుస్తోందని, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు కారణంగా భారం పడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు సైతం వెళ్తామన్నారు. సమావేసంలో పార్లమెంట్ క్యాండిడేట్ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కోడూరి రవీందర్‌రావు, ఎంపీపీ లింగాల నిర్మల పాల్గొన్నారు.