జిల్లా మొత్తం సుడా పరిధిలోకే

జిల్లా మొత్తం సుడా పరిధిలోకే
  • గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అవకాశం 
  • ప్రభుత్వానికి ఆదాయం 

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాలకే పరిమితమైన సిద్దిపేట అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ (సుడా)ని జిల్లా మొత్తం విస్తరించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లాలోని  514 గ్రామాలు సుడా పరిధిలోకి వచ్చాయి. 2017 లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుడా ఏర్పాటు కాగా 2018లో చైర్మన్ తోపాటు పాలక మండలిని ఏర్పాటు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని 11 గ్రామాలు, రూరల్ మండలంలోని 8 గ్రామాలతో పాటు చిన్నకోడూరు, కొండపాక మండలాలకు చెందిన 8 గ్రామాలను కలుపుతూ సుడాను ఏర్పాటు చేశారు. 

ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని విస్తరించడంతో జిల్లా మొత్తం సుడా పరిధిలోకి వచ్చినట్టయింది. 2014 లో గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గజ్వేల్ ఏరియా డెవలప్​మెంట్​అథారిటీ (గడా)ని ఏర్పాటు చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గడాను రద్దు చేసింది. సుడా విస్తరణతో సిద్దిపేటతోపాటు దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాల్టీలతో పాటు జిల్లాలోని మొత్తం గ్రామాలు దీని పరిధిలోకి వచ్చాయి.

అభివృద్ధికి అవకాశం

సుడా విస్తరణ వల్ల అభివృద్ధి పనుల అనుమతుల జాప్యాన్ని నివారించడమే కాకుండా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికంగా నిధులు మంజూరవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. వెంచర్లు ఏర్పాటు చేసే సమయంలో సామాన్యులు మోసపోకుండా సుడా నిబంధనల ప్రకారం వాటిని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. 

దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా మోసాలను నివారించవచ్చు. గ్రామాలు, పట్టణాలకు అనుసంధాన కర్తగా సుడా పనిచేస్తుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు మంజూరవడానికి అవకాశం ఏర్పడుతుంది. 

సుడా పదవులపై నేతల కన్ను

సుడాను విస్తరించడంతో చైర్మన్ తో పాటు 12 మందిని డైరెక్టర్లుగా నియమించే అవకాశం ఉండడంతో నేతల్లో ఆశలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రొటో కాల్ ప్రకారం సుడా చైర్మన్ పదవి అత్యంత ముఖ్యమైనది కావడంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గ నేతలు ఈ పదవిపై దృష్టి పెడుతున్నారు. నామినేటెడ్ పదవుల వేటలో ఉన్న నేతలు ఇప్పుడు సుడా చైర్మన్ లేదా డైరెక్టర్ పోస్టుకు పోటీ పడే అవకాశం ఉంది. మరోవైపు సిద్దిపేట మున్సిపాల్టీకే పరిమితమైన సుడా ఇప్పుడు జిల్లా మొత్తం విస్తరించడంతో స్థానిక నేతలు నిరాశకు గురవుతున్నారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఆరుగురు నేతలు సుడా చైర్మన్ పదవి కోసం తమదైన రీతిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుడాను జిల్లా వ్యాప్తం చేయడంతో సిద్దిపేట నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇప్పుడు సుడా పదవులకు జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన నేతలు పోటీ పడే పరిస్థితి నెలకొంది.