- ఎన్‌హెచ్ 365బీకి ఎక్స్‌టెన్షన్‌గా 54 కి.మీ హైవే నిర్మాణానికి కేంద్రం ఓకే
- ఈ హైవే రూ.1100కోట్ల కేటాయింపు
- ప్రస్తుత సిద్దిపేట– సిరిసిల్ల రోడ్డుపై 25 చోట్ల డేంజర్ టర్నింగ్స్
- ఇప్పటికే డీపీఆర్ సిద్ధం.. భూసేకరణ తర్వాత పనులు ప్రారంభం?
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిద్దిపేట మార్గంలో సిరిసిల్లవాసులకు రోడ్లపై టర్నింగ్ కష్టాలు తీరనున్నాయి. సిరిసిల్ల టూ సిద్దిపేట వరకు ఫోర్ లేన్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే సిద్దిపేట రోడ్డే దిక్కు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు 36 కి.మీ దూరంలో 25చోట్ల డేంజర్ మలుపులు ఉన్నాయి.
ఈ టర్నింగ్ వల్ల నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో 150 అడుగుల(ఫీట్ల) వెడల్పుతో రూ.1100 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సూర్యాపేట నుంచి దుద్దెడ వరకున్న 365బీని ఎక్స్‌టెన్షన్ చేస్తూ మొత్తంగా 54 కి.మీ రోడ్డు నిర్మించనున్నారు. ఇప్పటికే డీపీఆర్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
సిరిసిల్ల వరకు 365బీకి ఎక్స్‌టెన్షన్
సూర్యాపేట నుంచి సిద్దిపేట జిల్లా దుద్దెడ వరకు ఇప్పటికే హైవే 365బీ ఉంది. ప్రస్తుతం ఈ రోడ్డును సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు ఎక్స్‌టెన్షన్ చేయనున్నారు. ప్రస్తుతం దుద్దెడ–సిద్దిపేట మధ్య పనులు కొనసాగుతున్నాయి. దుద్దెడ మండలం మర్పడగ, సిద్దిపేట అర్బన్‌మండలం పరిధిలోని తడ్కపల్లి, ఎన్సాన్‌పల్లి, బూర్గుపల్లి, గుండావాలీఖర్దు, రూరల్ మండలం పుల్లూరు, చిన్నకోడూరు మండల పరిధిలోని రామంచ, గంగాపూర్, నారాయణరావుపేట మండలం పరిధిలోని మల్యాల, గుర్రాలగొంది, జక్కాపూర్, రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, బద్దెనపల్లి, మండెపల్లి, తంగళ్లపల్లి, సిరిసిల్లఅర్బన్ పరిధిలోని రగుడు వద్ద నున్న కలెక్టరేట్ క్రాస్‌రోడ్డు వరకు కొత్తరోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించారు. సిరిసిల్ల మానేరు వాగుపై మరో కొత్త బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ మార్గంలో సిరిసిల్లవాసులకు సిద్దిపేట వరకు టర్నింగ్‌ల నుంచి విముక్తి లభించనుంది.
త్వరలో భూసేకరణ
సిరిసిల్ల–సిద్దిపేట– దుద్దెడ మార్గంలో త్వరలో భూసేకరణ ప్రారంభిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్‌లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపం నుంచి ఈ రోడ్డుకు అలైన్‌మెంట్ ఇచ్చారు. కాగా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో కొందరు పొలిటికల్ లీడర్లు విలువైన భూములు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో ప్రస్తుత హైవే అలైన్‌మెంట్ ఈ భూముల మీదుగా పోతుండగా అక్రమంగా భూములు సంపాదించిన లీడర్లలో వణుకు మొదలైంది. కొందరు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి అలైన్‌మెంట్ మార్చాలని కోరుతున్నట్లు సమాచారం.
భూసేకరణ పూర్తయ్యాక పనులు ప్రారంభిస్తాం
దుద్దెడ టూ సిరిసిల్ల ఫోర్ లేన్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కాగా భూసేకరణ పనులు ప్రారంభించామని, పూర్తయ్యాక పనులు మొదలుపెడతాం.
అన్నయ్య, డీఈఈ సిరిసిల్ల