
- వృద్ధ దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
- సిద్దిపేట ఏసీపీ మధు వెల్లడి
సిద్దిపేట రూరల్, వెలుగు: వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితులను సిద్దిపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట ఏసీపీ మధు, రూరల్ సర్కిల్ సీఐ శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 11న నంగునూరు శివారులో తమ పౌల్ట్రీ ఫారమ్ నివసించే ఆవుల కొమరయ్య (80), బుధవ్వ(75) దంపతులు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజగోపాల్ పేట సీఐ శ్రీను ఆధ్వర్యంలో బద్దిపడగ గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేస్తుండగా.. ఆ సమయంలో బస్టాండ్ వద్ద గ్రామానికి చెందిన పసుపుల సంపత్, మాలోతు రాజు, మాలోతు శ్రీకాంత్ అనుమానాస్పదంగా కనిపించారు.
పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకొని విచారించారు. బంగారు, వెండి ఆభరణాల కోసమే వృద్ధ దంపతులను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. తాగుడుకు బానిసలుగా మారి ఈజీగా డబ్బులు సంపాదించేందుకు చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వృద్ధ దంపతుల వద్ద బంగారు ఆభరణాలు, డబ్బులు భారీగా ఉన్నాయనే ఉద్దేశంతో టార్గెట్ చేశారు. అందులో పని చేసే సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి 11 గంటల సమయంలో వెళ్లి వృద్ధదంపతులతో గొడవపడ్డారు. నిందితులను గుర్తుపట్టగా.. కుటుంబసభ్యులకు చెబుతారేమోనని ముందుగా బుదవ్వను మంచానికి వేసి కొట్టి చంపారు.
ఆ తర్వాత కొమరయ్య మెడకు కర్చీఫ్ చుట్టి ఉరేసి చంపారు. దంపతుల వద్ద బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకొని పారిపోయినట్టు ఏసీపీ వివరించారు. నిందితుల వద్ద 3 సెల్ ఫోన్లు, రెండు బైక్ లు, వెండి మొలతాడు, 30,800 నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు చెప్పారు. గతంలో కూడా నిందితులపై పలు చోరీ కేసులు ఉన్నాయి. కేసును ఛేదించిన సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్, చిన్నకోడూర్ ఎస్ఐ బాలకృష్ణను ఏసీపీ అభినందించారు.