దోపిడీ చేసి అప్పు కట్టిండు

దోపిడీ చేసి అప్పు కట్టిండు
  • అప్పులు తీర్చేందుకే గన్​తో కాల్చి 43.5 లక్షలు చోరీ
  • అందులోంచి 10 లక్షలతో అప్పులు కట్టిన నిందితులు
  • మిగిలిన రూ. 34  లక్షలను రికవరీ చేసిన పోలీసులు
  • సిద్దిపేట సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​ వద్ద కాల్పుల ఘటనలో నలుగురి అరెస్ట్

సిద్దిపేట, వెలుగు: ప్రేమ వ్యవహారంలో జైలుకెళ్లి అప్పుల పాలైన యువకులు.. వాటిని తీర్చేందుకు గన్​తో కాల్పులు జరిపి ఏకంగా రూ.43.50 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. కొట్టేసిన మొత్తంలో 10 లక్షలతో అప్పు కట్టిన నిందితులు.. మిగతా డబ్బులతో జల్సా చేద్దామనుకునే లోపే పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసు వద్ద గత నెల 31న డ్రైవర్ పై కాల్పులు జరిపి, కారులోంచి రూ.43.50 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. సిద్దిపేట సీపీ ఎన్​.శ్వేత సోమవారం కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోలుకు చెందిన గజ్జె రాజు(26), తన సమీప బంధువైన సాయికుమార్(22)లపై ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో నిరుడు సిద్దిపేట వన్ టౌన్​లో కేసు నమోదైంది. 

జైలుకు వెళ్లిన ఇద్దరూ నిరుడు సెప్టెంబరులో బెయిల్ పై బయటికి వచ్చారు. బెయిల్ కోసం, కోర్టు, లాయర్ల ఫీజుల కోసం పెద్దమొత్తంలో అప్పు చేశారు. అప్పులవాళ్ల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో వాటిని తీర్చేందుకు ఏదైనా దోపిడీ చేయాలని భావించారు. సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతాయని తెలుసుకొని అక్కడ దోపిడీ చేయాలని ప్లాన్​ చేశారు. పక్కా వ్యూహం ప్రకారం.. సిరిసనగండ్లలో ఒక పల్సర్​బైకును అపహరించిన నిందితులిద్దరూ దాని మీదే గత నెల 31న సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి వకుళాభరణం నర్సయ్య హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న తన176 గజాల ఫ్లాట్ ను శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మాడు. వచ్చిన డబ్బులు రూ. 43.50 లక్షలు లెక్కపెడుతుండగా నిందితులిద్దరూ గమనించారు. డబ్బులను బ్యాగులో పెట్టిన నర్సయ్య.. దాన్ని తన డ్రైవర్ కు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్లాడు.  డ్రైవర్ క్యాష్ బ్యాగును ఇన్నోవాలో పెట్టుకొని ఓనర్ ​కోసం వెయిట్ చేస్తుండగా, గజ్జె రాజు, సాయికుమార్ డ్రైవర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వాలంటూ తుపాకీతో బెదిరించారు. డోర్ తీయకుండా డ్రైవర్ కారు స్టార్ట్ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో రాజు తన చేతిలో ఉన్న గన్​తో డోర్​గ్లాస్​ పగులగొట్టి క్యాష్​బ్యాగ్​పట్టుకున్నాడు. డ్రైవర్, ​రాజు మధ్య పెనుగులాట జరిగింది. రాజు గన్​తో కాల్చగా.. డ్రైవర్ కాలి తొడలోంచి బుల్లెట్​దూసుకెళ్లింది. నిందితులిద్దరూ క్యాష్​బ్యాగు తీసుకొని పల్సర్​బైక్​పై పారిపోయారు. 

పాత నేరస్తుల విచారణతో..
బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ భిక్షపతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు15స్పెషల్​ టీమ్ లను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్​ స్టార్ట్​ చేశారు. పాత నేరస్తులను విచారించే క్రమంలో సాయికుమార్​ గురించి క్లూ దొరికింది. దీంతో శనివారం ఉదయం పోలీసులు సాయి కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడీ వివరాలు బయటకువచ్చాయి. మరో నిందితుడు గజ్జె రాజు, వీళ్లిద్దరికీ సహకరించిన బలింపురం కరుణాకర్, -బిగుళ్ల వంశీకృష్ణలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.34 లక్షల క్యాష్​తో పాటు ఒక కారు, రెండు బైక్ లు, మూడు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.10 లక్షలతో అప్పులు తీర్చినట్లు నిందితులు వెల్లడించారని, ఆ మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని సీపీ శ్వేత తెలిపారు. ఈ దోపిడీలో నిందితులు ఉపయోగించిన రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై స్పెషల్​ పోలీస్​ టీమ్ విచారణ జరుపుతోందని, త్వరలో వాటి వివరాలను వెల్లడిస్తామని ఆమె చెప్పారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపినట్టు తెలిపారు.