ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు : రైతులు సాధారణ పంటలను వదిలి లాభదాయకమైన  ఆయిల్ పామ్, మల్బరీ పంటల వైపు దృష్టి సారించాలని సిద్దిపేట రూరల్ మండలం ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్ రావు అన్నారు. శనివారం ఆమె సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ తౌటి ఉదయశ్రీ తిరుపతి తో కలిసి ఆయిల్ పామ్, మల్బరీ సాగు పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులర్ పంటలను కాకుండా విభిన్నమైన పంటలను వేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చని అన్నారు.

ప్రభుత్వం ఆయిల్ పామ్, మల్బరీ సాగు కోసం రైతులకు రాయితీలను అందిస్తుందని, మార్కెట్ లో కూడా పంటలకు మంచి గిరాకీ ఉందని తెలిపారు. ఏవో పరశురాం రెడ్డి మాట్లాడుతూ ఆలస్యంగా విత్తిన వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉందని, దాని నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ లాంటి మందులు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సెరికల్చర్ ఆఫీసర్ మల్లయ్య, తౌటి తిరుపతి, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

వేములఘాట్ ప్రజలకు న్యాయం చేస్తాం

సిద్దిపేట, వెలుగు :  మల్లన్న సాగర్  ముంపు  గ్రామమైన  వేములఘాట్ ప్రజలకు న్యాయం చేస్తామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. వారికి చట్ట ప్రకారం  నష్ట పరిహారం చెల్లించడంతో పాటు ఆర్ అండ్​ ఆర్ కాలనీలలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. శనివారం కలెక్టరేట్ లో అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వేములఘాట్ వాసులు నివసిస్తున్న ఆర్ అండ్​ ఆర్ కాలనీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో గ్రామంలో భూమిని, ఇళ్లను కోల్పోయిన వారి పెండింగ్ సమస్యలపై చర్చించారు. కోర్టు కేసుతో ఆగిన ప్యాకేజీల గురించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత పరిష్కరిస్తామని,  రీజనల్ రింగ్ రోడ్డు లో ఓపెన్ ప్లాట్లు  కోల్పోయిన వారికి వేరే ప్రదేశంలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వేములఘట్ తో పాటు  ఇతర గ్రామాల్లోని  నిర్వాసితుల  నష్టపరిహారం, ప్లాట్ల కేటాయింపు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, కాలనీలలో గుడి, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, సీసీ రోడ్ల, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ పైప్​లైన్, స్తంభాలు,  వీధిలైట్లు ఇతర సమస్యలు త్వరగా పూర్తి చేయ్యాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి వేములఘాట్, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బహుమతుల ప్రదానం
స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో  భాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలకు శనివారం కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి కింద రూ.20 వేల నగదు బహుమతిని తొగుట జూనియర్ కళాశాల,  రెండవనగదు బహుమతి రూ.15 వేలు మిట్టపల్లి పాఠశాల,  తృతీయ నగదు బహుమతి రూ10వేలు చేర్యాల మహిళా డిగ్రీ కళాశాలకు అందజేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయ అధికారిని  నిర్మల,  ఎఆర్సీవో వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. 

‘డబుల్’ ఇండ్ల పేపర్లు ఇవ్వండి 
తూప్రాన్ ఎమ్మార్వో ఆఫీస్​ వద్ద లబ్ధిదారుల ఆందోళన

తూప్రాన్, వెలుగు : మెదక్ జిల్లా తూప్రాన్ లో డబుల్ బెడ్ రూమ్​ఇళ్లను కేటాయించి నెల రోజులు గడిచినా ఇంటికి సంబంధించిన ప్రతాలు ఇవ్వడం లేదని బాధితులు శనివారం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్​ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూప్రాన్ డివిజన్ కేంద్రంలో నెలరోజుల కింద మంత్రి హరీశ్​ రావు 325 మందికిపైగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారన్నారు. కానీ ఇప్పటికీ ఇళ్లకు సంబంధించిన పేపర్లు ఇవ్వలేదని, స్థానికంగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​ వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ట్రాఫిక్ ​భారీగా నిలిచిపోవడంతో తూప్రాన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు. 

రాహుల్​ యాత్ర సక్సెస్​ చేయాలి
మెదక్​ (రేగోడ్​)/వట్​పల్లి/నారాయణఖడ్, వెలుగు :
జిల్లాలో నవంబర్​ మెదటి వారంలో జరుగనున్న రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్రను సక్సెస్​ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​ ఎలక్షన్​ కమిటీ చైర్మన్​దామోదర ​రాజనర్సింహ, టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి కాంగ్రెస్​ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేగోడు మండల కేంద్రంలో, వట్​పల్లి మండలం  మరువెల్లి శివపార్వతుల ఫంక్షన్ హాల్ లో రాజనర్సింహ, నారాయణఖేడ్​ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం కడ్పల్ లో  సంజీవరెడ్డి శనివారం పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్​లు, రైతుబంధు పథకాలను ముందేసుకొని పబ్బం గడుపుతుందని విమర్శించారు. ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్ పార్టీ మద్యం, డబ్బు పంపిణీతో గెలవాలని చూస్తుందన్నారు. అభివృద్ధి కాంగ్రెస్​ హయాంలోనే జరిగిందని, తెలంగాణ వచ్చాక ఏమి అభివృద్ధి చేశారో టీఆర్​ఎస్​ నాయకులు చెప్పాలని డిమాండ్​ చేశారు. 3న శివ్వంపేట నుంచి మొదలై  సుల్తాన్ పూర్ వరకు భారత్​ జోడో పాదయాత్ర కొనసాగుతుందని, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 

బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ధరలు పెరిగాయ్​
కోహెడ(హుస్నాబాద్​), వెలుగు :
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి ఆరోపించారు. శనివారం హుస్నాబాద్​లో నిర్వహించిన అక్కన్నపేట, హుస్నాబాద్​ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్​శక్తులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు తాము సమగ్రంగా ఆలోచించి టీఆర్​ఎస్​కు మద్దతు తెలుపుతున్నామన్నారు. వామపక్షాల మద్దతుతో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్​ గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు గడిపే మల్లేశ్, కొమ్ముల భాస్కర్, కనుకుట్ల శంకర్​ పాల్గొన్నారు.

రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలకు ఫోన్లు!
మెదక్ (శివ్వంపేట), వెలుగు :
ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలనే  ప్రభుత్వం అభివృద్ధి  చేస్తోందని, అందుకు తమ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. మెదక్​ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తి శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్​ చేసి మునుగోడు ఎన్నిక, అక్కడి అభివృద్ధి గురించి మాట్లాడారు. మెదక్​ నియోజకవర్గం కూడా అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పద్మాదేవేందర్​రెడ్డిని కోరాడు. అలాగే శనివారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లికి చెందిన అశోక్​ అనే యువకుడు నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డికి ఫోన్​ చేసి ఇదే విధంగా మాట్లాడారు. మండలంలోని ఉసిరికపల్లి, పాంబండ, పోతులగుడ, గోమారం, నవాపేట రోడ్డు అధ్వానంగా మారి ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకు నర్సాపూర్​ఎమ్మెల్యే రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే ఆ సమస్యలు పరిష్కారమవుతాయని వివరించాడు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ తాను ఎందుకు రాజీనామా చేయాలని, ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండేందుకు ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. 

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు :
 జడ్పీ మీటింగ్​లో ప్రజా ప్రతినిధులు చెప్పిన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్​హాల్​లో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీతో కలిసి ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను నవంబర్ 20 లోగా  తమకు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ రాజార్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఫిర్యాదులు చేయడానికి సంగారెడ్డి కలెక్టర్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ 08455 272233 ఫోన్ చేసి తెలుపాలన్నారు. 

ప్రకృతి వనాలు బాగుండేలా చూడాలి
కంది, వెలుగు : ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు బాగుండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సంగారెడ్డి కలెక్టర్​ డాక్టర్ శరత్​సూచించారు. శనివారం అడిషనల్​ కలెక్టర్​ రాజార్షీ షా తో కలిసి కంది మండల కేంద్రంలోని ప్రకృతి వనాన్ని ఆయన సందర్శించారు. ప్రకృతి వనానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో టీ పాయింట్​ను ఏర్పాటు చేయాలని సమాఖ్య  గ్రూప్​ మహిళలకు సూచించారు. అనంతరం అక్కడి శివాలయంలో పూజలు చేశారు. ఆయన వెంట జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసీల్దార్ ​విజయలక్ష్మి, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీటీసీ నందకిశోర్​, సర్పంచ్​ విమల ఉన్నారు. 

తహసీల్దార్ల బదిలీలు
సంగారెడ్డి టౌన్, వెలుగు :
సంగారెడ్డి జిల్లాలో 26 మండలాల పరిధిలో పనిచేస్తున్న తహసీల్దార్లను, రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏవోలను బదిలీ చేస్తూ కలెక్టర్ డాక్టర్ శరత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కలెక్టరేట్ ఏవోగా పనిచేస్తున్న స్వర్ణలతను పుల్కల్ మండల తహసీల్దారుగా, పటాన్ చెరు తహసీల్దార్ గా పనిచేసిన మహిపాల్ రెడ్డి ని సంగారెడ్డి కలెక్టరేట్ ఏవోగా బదిలీ చేశారు. 

సిద్దిపేట జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలు
కోహెడ(హుస్నాబాద్​), వెలుగు :
 సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 421 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇవి సరిపోకపోతే మరిన్ని ఏర్పాటు చేస్తామని అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం హుస్నాబాద్ ​మార్కెట్ యార్డులో  కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా అవసరం ఉన్నని కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ధాన్యాన్ని సరిగా ఆరబెట్టి కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ రజిత, వైస్​ చైర్మన్​ అనిత, ఏఎంసీ చైర్మన్​ అశోక్​బాబు, సింగిల్​విండో చైర్మన్​ శివ్వయ్య, తదితరులు ఉన్నారు.

చాకరిమెట్లలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

మెదక్​ (శివ్వంపేట), వెలుగు : కార్తీక మాసం సందర్భంగా మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామ పరిధిలోని చాకరిమెట్లలో  శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.  ఉమ్మడి మెదక్​ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వచ్చారు. స్వామికి అభిషేకం, అర్చన, చందన పూజలు నిర్వహించారు. మహిళలు ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయశర్మ  ఏర్పాట్లు చేశారు. 

చెట్లు తొలగించిన వారిపై క్రిమినల్​ కేసులు
మెదక్​ (శివ్వంపేట), వెలుగు :
శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామ శివారులో అటవీ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నాయకుడి అండదండలతో కబ్జాకు ప్రయత్నించిన నేపథ్యంలో డీఎఫ్​ఓ రవి ప్రసాద్​ శనివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రెండు ఎకరాల ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి అడవిలో నుంచి రోడ్డు వేశారని తెలిపారు. ఎంక్వైరీ చేసి అటవీ భూమి కబ్జాకు పాల్పడిన వారిపై ఫారెస్ట్ యాక్ట్​ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఫారెస్ట్​ రేంజ్ ఆఫీసర్ మోహన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రవికుమార్, కొంతన్​పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ రైతులు ఉన్నారు.