సుడా రియల్ ఫ్లాప్ షో: రెండుసార్లు ఓపెన్ ఆక్షన్..80శాతం ప్లాట్లు అమ్ముడుపోలే

సుడా రియల్ ఫ్లాప్ షో: రెండుసార్లు ఓపెన్ ఆక్షన్..80శాతం ప్లాట్లు అమ్ముడుపోలే
  • రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో మెగా వెంచర్
  • రెండు సార్లు ఓపెన్ ఆక్షన్ నిర్వహించినా ఆదరణ కరువు 
  • మొత్తం 98 ప్లాట్లకు అమ్ముడు పోయినవి 12 ప్లాట్లే 
  • అసైనీల ఆందోళలతో వెనక్కి తగ్గిన కొనుగోలుదారులు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) రియల్ మెగా వెంచర్ ఫ్లాప్ అయింది. ఏడాదిలో రెండు విడతలుగా ఓపెన్ ఆక్షన్ నిర్వహించినా కొనుగోలుదారుల నుంచి ఆదరణ కరువైంది. 98 పాట్లలో  కేవలం 12 ప్లాట్లు మాత్రమే సేల్ అయ్యాయి. రాష్ట్రంలోనే మొట్ట మొదటగా సిద్దిపేట టౌన్ శివారు మిట్టపల్లిలో సుడా పరిధిలో మెగా వెంచర్  ఏర్పాటు చేసింది. అయినా.. ప్రజల నుంచి ఆశించిన ఆదరణ లభించలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు కనిష్ట ధరను తగ్గించి రెండు సార్లు వేలం పాట పాడగా కొనుగోలుదారులు పోటీ పడతారని అధికారులు భావించారు. ఈనెల 11, 20  తేదీల్లో  మిగిలిన 98 ప్లాట్లకు ఓపెన్ ఆక్షన్ నిర్వహించారు.  గతంలో 8 వేలు ఉన్న కనిష్ట ధరను  5,500 తగ్గించినా కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. ఈనెల11న తొలిసారి ఓపెన్ ఆక్షన్ లో గరిష్టంగా 6,600  ధర పలికి 9 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. బుధవారం నిర్వహించిన ఓపెన్ ఆక్షన్ లో కేవలం నలుగురు పాల్గొనగా మూడు ప్లాట్లను కొనుగోలు చేయగా గరిష్ట ధర 5,700 మాత్రమే కావడం గమనార్హం.

రియల్ భూమ్ లేని చోట వెంచర్

అసైన్డ్ భూములను సేకరించి మెగా వెంచర్లతో ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచాలని సుడా సంకల్పించింది. మెగా వెంచర్ లోని ప్లాట్లు పలు కారణాలతో డిమాండ్ లేక అమ్ముడవడం లేదు. సిద్దిపేట టౌన్ కు దూరంగా వెంచర్ వేయడంతో పాటు అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ లేక పోవడంతో కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు దారులు ముందుకురావడం లేదు. మెగా వెంచర్ ఏర్పాటు సమయంలో కోట్ల రూపాయలు వెచ్చించి పనులను ప్రారంభించినా తర్వాత అవి అర్థాంతరంగా నిలిచిపోయాయి. హై వేకు సమీపంలోనే ఉన్నా ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత వాటిని అభివృద్ధి చేయరేమోననే అనుమానాలు రావడంపైనా చర్చించుకుంటున్నారు. భవిష్యత్ లో మెగా వెంచర్ లో అభివృద్ధి పనుల గురించి ఎవరిని అడగాలి..? అడిగితే వారు స్పందిస్తారా? ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 

కలెక్టర్ నిర్ణయమే ఫైనల్

 మెగా వెంచర్ ప్లాట్లు ఆశించినంతగా అమ్ముడుపోకపోతుండగా కలెక్టర్ నిర్ణయమే కీలకంగా మారింది. ఏడాది కాలంగా ప్లాట్ల విక్రయాలు నిలిచిపోగా..  కలెక్టర్  పర్యటించి  పరిస్థితులు తెలుసుకుని కనిష్ట ధరలను తగ్గించి ఓపెన్ ఆక్షన్ చేపట్టాలని ఆదేశించారు. రెండు సార్లు  నిర్వహించినా అంతంత మాత్రంగానే ప్లాట్లు అమ్ముడుపోయాయి.  మళ్లీ కలెక్టర్  ఏం నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది.  సుడా వైస్ చైర్మన్ అశ్రిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్లాట్ల పరిస్థితిని కలెక్టర్ కు వివరించి ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అసైనీల నిరసనలు 

మెగా వెంచర్ లో తమ భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని కొందరు అసైనీల వారసులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓపెన్ ఆక్షన్ సందర్భంగా అసైనీలు కొందరు సుడా ఆఫీసు వద్ద నిరసన తెలుపగా రెండు రోజుల కింద ఏకంగా వెంచర్ లోనే గుడిసె వేశారు. అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు తమకు 800 గజాలు ఇస్తామని చెప్పిన అధికారులు అనంతరం మాట్లాడక పోవడంతోనే తాము ఆందోళనకు దిగినట్టు చెబుతున్నారు. ఇది కాస్త వివాదాని కి దారితీసింది. దీంతో రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలుచేసి ఇబ్బందులు పడేకంటే కొనకుండా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.