
‘టిల్లు స్క్వేర్’లాంటి సూపర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి వచ్చిన చిత్రం ‘జాక్’(JACK). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. సిద్ధుకి జంటగా వైష్ణవి చైతన్య నటించింది.
ఈ మూవీ గురువారం (2025 ఏప్రిల్ 10న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పై యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్ ఆడియన్స్ ను మెప్పించిందా? సిద్ధుకి హ్యాట్రిక్ హిట్ పడినట్లేనా? బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న కథ ఎలా ఉంది? అనే అంశాలు రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
జాక్ అలియాస్ పాబ్లో నెరోడా (సిద్దు జొన్నలగడ్డ) చిన్నప్పుడు చాలా కలలు కంటాడు. క్రికెట్ మొదలు టెన్నీస్ వరకూ చాలా ప్రయత్నిస్తాడు. కోచ్ చెప్పింది కాకుండా తనదైన ఆటతీరు చూపించాలి అనుకుంటాడు. దాంతో కోచ్‌లు అంతా ఇతను దేనికీ పనికిరాడంటూ చేతులెత్తేస్తారు. పెద్దయ్యాక అతను రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవుతాడు. సెలక్షన్ ప్రక్రియ పూర్తవకుండానే అత్యుత్సాహంతో తీవ్రవాదులను పట్టుకునేందుకు.. 'ఆపరేషన్ బటర్ ఫ్లై' పేరుతో బయల్దేరుతాడు.
Also Read : ఒట్టేసి చెప్పినట్టే వచ్చేసాడు.. మనోజ్ బాజ్‌పేయ్తో ఆర్జీవీ హార్రర్ థ్రిల్లర్
ఈ క్రమంలో హైదరాబాద్ సహా దేశంలోని నాలుగు నగరాల్లో బాంబులతో విధ్వంసం సృష్టించాలనేది టెర్రరిస్టుల ప్లాన్. దాన్ని భగ్నం చేసేందుకు మనోజ్ (ప్రకాష్ రాజ్) నేతృత్వంలోని రా టీమ్ రంగంలోకి దిగుతుంది. కానీ తన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా జాక్.. ఓ టెర్రరిస్ట్‌ను కిడ్నాప్ చేస్తాడు.
ఆ కన్ఫ్యూజన్‌లో రా ఏజెంట్ అని తెలియక మనోజ్‌ను కూడా కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఓ వైపు టెర్రరిస్ట్‌లు, మరోవైపు రా టీమ్ జాక్ కోసం వెతుకుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది..? జాక్ లైఫ్‌లోకి లేడీ డిటెక్టివ్ అబ్షాన్ బేగం అలియాస్ భానుమతి (వైష్ణవి చైతన్య) ఎందుకు వచ్చింది? జాక్ అత్యుత్సాహపు ఆపరేషన్ సఫలమైందా, విఫలమైందా అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే?
దేశాన్ని కాపాడేందుకు పోలీసులు, ఆర్మీ కంటే ముందుంటుంది రా ఏజెన్సీ. కానీ మన జాక్.. రా ఏజెన్సీ కంటే కూడా ముందుంటాడు. నిజానికి ఈ తరహా గూఢచారి కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఇందులో కొత్తదనం అంటూ ఏమీ లేదు. అలాగని కథ చెప్పిన విధానం ఏమైనా కొత్తగా ఉందంటే అదీ లేదు. సిద్దు మార్క్ ‘టిల్లు’ డైలాగ్‌లు అక్కడక్కడా వర్కవుట్ అయినా.. రొటీన్ కథాకథనాలు దాన్ని డామినేట్ చేశాయి.
మనసుకి హత్తుకునే లవ్ ట్రాక్ గానీ, మనసారా నవ్వుకునే కామెడీ సీన్ కానీ లేవు. సాధారణంగా తన చిత్రాల్లో హీరోయిన్ పాత్రలను బలంగా చూపిస్తాడు భాస్కర్. కానీ ఇందులో వైష్ణవి పాత్ర తేలిపోయింది. సాధారణంగా రా, దేశభక్తి ప్రధాన కథలు చాలా వరకు సీరియస్‌గానే సాగుతాయి. ఈ కథల్లో కామెడీకి ఏ మాత్రం స్కోప్ ఉండదు. కానీ, ఇందులో కామెడీతో చెప్పాలనుకున్న డైరెక్టర్ భాస్కర్ ప్రయత్నం.. ప్రేక్షకుల ఓపికకు, సహనానికి పరీక్షలా మారింది.
ఎవరెలా చేశారంటే?
సిద్దు జొన్నలగడ్డ జాక్ పాత్రలో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఇందులోనూ తనకు అలవాటైన ‘టిల్లు’ పాత్ర అక్కడక్కడా కనిపిస్తుంది. బేగం అలియాస్ భానుమతిగా వైష్ణవి నటనలో చాలావరకూ ఆర్టిఫిషియాలిటీ కనిపించింది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవలేదు. కొంత గ్యాప్ తర్వాత విలన్‌గా కనిపించినా రాహుల్ దేవ్ నటన ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, సుబ్బరాజులకు ఈ తరహా పాత్రలు కొత్తేమి కావు.
సాంకేతిక అంశాలు?
పాటలు, బీజీఎం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించే స్థాయిలో లేవు. సురేష్ బొబ్బిలి, అచ్చు రాజమణితో పాటు సామ్ సీఎస్ మ్యూజిక్ కూడా సినిమాకు చెప్పుకోదగ్గ హెల్ప్ అవ్వలేదు. సీజీ వర్క్స్ తేలిపోయాయి. ఇలాంటి రొటీన్ సినిమాలకు ఎడిటర్ మాత్రం ఏం చేయగలడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో శిల, శిల్పం అంటూ ఫిలాసఫీ చెప్పాడు భాస్కర్. కానీ ఈ సినిమా విషయంలో అంతంతమాత్రంగా చెక్కిన శిల తప్ప అద్భుతమైన శిల్పం కనిపించలేదు.