ఫేస్బుక్, జీమెయిల్లోకి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? యూజర్‌ఐడీ, పాస్వర్డ్ కచ్చితంగా టైప్ చేయాలి. అది మస్ట్. కానీ, అవేవీ లేకుండా వాటిలోకి లాగిన్ అయితే ఎట్లుంటది? అది నిజం కాబోతోంది. కానీ, అందరికీ కాదు. కేవలం యాపిల్ యూజర్లకే. వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా కేవలం యాపిల్ ఐడీతో లాగిన్ అయిపోతే చాలు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ‘సైన్ ఇన్ విత్ యాపిల్’ అనే కొత్త యాప్‌ను సంస్థ తీసుకొచ్చింది. దాని వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది.
మంగళవారం శాన్‌జోస్‌లో నిర్వహించిన డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడెరిగి యాపిల్‌లో కొత్త ఫీచర్లను వివరించారు. సైన్ఇన్ విత్ యాపిల్‌లో యాపిల్ యూజర్లు ఫేస్ ఐడీతోనూ లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు. ఐవోస్ 13లో ఈ కొత్త ఫీచర్లు ఉండబోతున్నాయి. యాపిల్‌లో ఫేమస్ యాప్ ఐట్యూన్స్. పాటలు కావాలన్నా, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌తో కనెక్ట్ కావాలన్నా ఐట్యూన్స్ చాలా అవసరం. అలాంటి ఐట్యూన్స్‌ను తీసేస్తున్నట్టు యాపిల్ అధికారికంగా ప్రకటించింది. దాని స్థానంలో మూడు కొత్త యాప్స్‌ను తీసుకొచ్చింది. యాపిల్ మ్యూజిక్, యాపిల్ పాడ్‌కాస్ట్, యాపిల్టీవీలను తెచ్చింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కనెక్ట్ అయిన వాళ్లు ఐట్యూన్స్‌ను వాడుకునేలా వెసులుబాటు కల్పించింది. ఐట్యూన్స్ మ్యూజిక్ స్టోర్ కూడా అందుబాటులోనే ఉంటుందని చెప్పంది. వీటితో పాటు యాపిల్ మ్యాప్స్నూ తెచ్చింది.