చెడుపై మంచి సాధించిన విజయాన్ని దసరా లేదా విజయదశమి పండుగగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. శ్రీరాముడు ఈ రోజునే (దసరా పండుగ రోజునే) రావణుని సంహరించాడు. ఈ ఏడాది (2023)దసరా పండుగను ఎప్పుడు జరుపుకుంటారో ఈ కథనంలో తెలుసుకుందాం.
దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ?
దసరా నాడు రావణ దహనానికి ప్రదోష కాల ముహూర్తం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి (అక్టోబర్23, 2023) సాయంత్రం 05.44 నుండి అక్టోబర్24, 2023 మధ్యాహ్నం 03.14 వరకు ఉంది.ఈ సంవత్సరం విజయదశమి పండుగను 24 అక్టోబర్ 2023 న జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 06:35 నుండి 08:30 గంటల మధ్య రావణ దహనం నిర్వహించాలని పండితులు చెబుతున్నారు.
దసరాకు ఒకరోజు ముందు శాస్త్ర పూజ చేస్తారు.శ్రీరాముడు .. రావణుడిని చంపడానికి ముందు 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి, 10వ రోజు రావణుడిని వధించాడని పురాణాలు చెబుతున్నాయి. దసరా రోజున విజయ ముహూర్తం పూజకు ఉత్తమమైనది. అక్టోబర్ 24 మధ్యాహ్నం 02.04 నుండి 02.49 వరకు విజయ ముహూర్తం ఉంటుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు.
దసరా ప్రాముఖ్యత
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.
ఒక్కోరోజు ఒక్కో అలంకారం
బొమ్మల కొలువు పెట్టడం సంప్రదాయంలో ఒక ఆనవాయితీ. దసరా నవరాత్రిళ్ల రోజుల్లో ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో బాధ్రపద అమావాస్య నుంచి ఆశ్వయుజు శుద్ద నవమి వరకు బతుకమ్మ ఆడతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ.
దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి
విజయ దశమి దసర చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని పది రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజని పురాణాల్లో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అందుకే దసరా జమ్మి చెట్టుకు పూజిస్తారు
శమీ శమీ శమయతే పాపం ..శమీ శతృ వినాశని
అర్జునస్య ధనుర్ధారి... రామస్య ప్రియదర్శిని
అని చదువుతూ.. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ద దశమి నుంచి వచ్చే ఏడాది ఆశ్వయుజ శుద్ద నవమి వరకు అంతా మంచి జరగాలని.. తాము తలపెట్టిన పనుల్లో విజయం సాధించాలని దుర్గామాతను వేడుకుంటారు.
దుర్గామాత ఎలా జన్మించింది....
ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడని.... దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారి.... త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించిందని పురాణ గ్రంధాల ద్వారా తెలుస్తోంది.
దుర్గాదేవికి సర్వ దేవతల ఆయుధాలు
శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమెకు 18 బాహువులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారట. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.
ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరాడి.. చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది, అదే విజయదశమి.