హైదరాబాద్, వెలుగు : రియల్టీ డెవలపర్ సిగ్నేచర్ గ్లోబల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో రూ. 5,900 కోట్ల విలువైన ప్రీలాంచ్ అమ్మకాలను సాధించింది. గత సెప్టెంబరు క్వార్టర్ అమ్మకాలతో పోలిస్తే వీటి విలువ 184శాతం పెరిగింది. అప్పుడు రూ. 2,780 కోట్ల వరకు ప్రీ-సేల్స్‌ని రిపోర్ట్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ టైటానియం ఎస్‌పీఆర్ రూ. 3,000 కోట్లకు అమ్ముడయింది. సోహ్నా కారిడార్‌లో టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌లు డాక్సిన్ విస్టాస్ ప్రారంభించడం ద్వారా కంపెనీ రూ. 2,300 కోట్ల విలువైన ప్రీ-సేల్స్ జరిపింది.
ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్, ముఖ్యంగా గురుగ్రామ్ మార్కెట్ బలంగా ఉందని కంపెనీ చైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో కంపెనీ కలెక్షన్లు 60శాతం పెరిగి రూ.2,130 కోట్లకు చేరుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 1,160 కోట్ల రూపాయల అప్పులు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్ల చివరి నాటికి కంపెనీ నికర రుణం 1,010 కోట్ల రూపాయలకు తగ్గింది.