ఫిబ్రవరి 24 విజయ ఏకాదశి పూజ.. సకల కార్యాలకు విజయం..

ఫిబ్రవరి 24  విజయ ఏకాదశి పూజ.. సకల కార్యాలకు విజయం..

మాఘ బహుళ ఏకాదశి (ఫిబ్రవరి 24) వస్తోంది. ఆ రోజున విష్ణువును పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. మాఘ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి లేదా సకలకార్య  విజయ ఏకాదశి అంటారు.  ఆ రోజు  ఏ పనిచేసినా విజయం సాధిస్తుందని చెబుతుంటారు. విజయ ఏకాదశి రోజు (ఫిబ్రవరి24) ఆరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి.. ఎలా పూజచేయాలో తెలుసుకుందాం. . .

పురాణాల ప్రకారం ఏకాదశి తిథి  శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే..  పుణ్యం వస్తుందంట. అంతేకాకుండా తెలిసీ.. తెలియక చేసిన పాపాలన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు. అందుకే  ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. మాఘ బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి లేదా - సకలకార్య  విజయ ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం  - విజయ ఏకాదశి  ఏకాదశి ఫిబ్రవరి 24వ తేదీన వచ్చింది. అయితే వృత్తి(ఉద్యోగ, వ్యాపార) పరంగా విజయాన్ని అందుకోవాలంటే విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు చెబుతున్నారు. 

మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సకల కార్య సిద్ది  ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి అంటే.. మనం ఏ పని ఆచరించినా, ఏ కోరికలు కోరుకున్న అవి వెంటనే సఫలమవుతాయట.

 పూజా విధానం ఇదే

  •  బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.
  • ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే తలస్నానం ఆచరించి పూజ గదిని అలంకరించుకోవాలి.
  •  లక్ష్మీ నారాయణుల ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఒకవేళ లక్ష్మీ నారాయణుల ఫొటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహాస్వామి.. ఇలా విష్ణు సంబంధమైన ఫొటో తీసుకుని దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  •  ఫొటో ఎదురుగా వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి.
  •  విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి. అంటే తెల్లగన్నేరు, నందివర్దనం, తుమ్మి పూలు, జాజిపూలు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి. పూలతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ.... ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూలతో పూజించాలి.
  • ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి.
  •  ఏదైనా విష్ణు సంబంధమైన(రాముడు, కృష్ణుడు, నరసింహాస్వామి, వేంకటేశ్వర స్వామి) ఆలయానికి వెళ్లాలి.
  • ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయాలి. 
  • దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని గరుడధ్వజ దీపం అంటారు.
  • ఏకాదశి రోజు ఉపవాస దీక్ష పాటించాలి.  పాలు..పండ్లు తీసుకోవచ్చు.
  • రోజంతా పండ్లు తినాలి. రాత్రి మేల్కొని జాగారం చేయాలి
  • నిరుపేదలకు దానం చేయండి. పేదలకు ఆహారం అందించండి.

భగవన్నామస్మరణలో గడపాలి. ఎవరిని దూషించకూడదు.  ద్వాదశి రోజు పూజ చేసి.. అనంతరం సాత్వికాహారం తినాలి
ఆ తరువాత దేవాలయానికి వెళ్లి  ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి.ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. దేవాలయంలో ముగ్గులు వేయడం, ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు.

పవిత్రమైన విజయ ఏకాదశి రోజున నారాయణుని పూజించి భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి. శ్రీకృష్ణ భగవానుడు విజయ ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైతే విజయ ఏకాదశిని నిజమైన భక్తితో ఆచరిస్తారో వారు మహా విష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఆచారాల ప్రకారం విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు మరణానంతరం విష్ణులోకం అంటే వైకుంఠ ధామం పొందుతారు.విజయ ఏకాదశి రోజున నిష్టతో, భక్తితో ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు భజనలు , కీర్తనలు పఠించడం, దానధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు.