ఆధ్యాత్మికం : ధనుర్మాసం పురాణ కథ ఏంటీ.. వైకుంఠ ఏకాదశి ముక్తిని ప్రసాదిస్తుందా..? ఉత్తర దిక్కు దేనికి ప్రతీక

ఆధ్యాత్మికం : ధనుర్మాసం పురాణ కథ ఏంటీ.. వైకుంఠ ఏకాదశి ముక్తిని ప్రసాదిస్తుందా..? ఉత్తర దిక్కు దేనికి ప్రతీక

ధనుర్మాసం మిగిలిన మాసాల కంటే పరమపవిత్రమైంది. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైంది. అంతేకాదు ఈ మాసంలోనే ఎన్నో పండుగలు వస్తాయి. అన్నింటిలో వైకుంఠ ఏకాదశి పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు. ఎందుకంటే, స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి.

ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. వైకుంఠ ఏకాదశినే స్వర్గద్వారం..ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు దేవాలయ ఉత్తర ద్వారం గుండా విష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అంతేకాదు స్వర్గలోక ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టే ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వా రమని పిలుస్తారు.

పురాణ కథ

పద్మపురాణం ప్రకారం కృతయుగంలో ముర అనే రాక్షసుడు చంద్రావతి పట్టణాన్ని పాలిస్తూ, బలగర్వంతో దేవతలను బాధలు పెట్టేవాడు. దాంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి, తమ బాధలు చెప్పుకున్నారు. విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి, ఆ రాక్షసుడిపై యుద్ధానికి పూనుకున్నాడు.  ఆ రాక్షసుడు సముద్రంలోకి వెళ్లి దాక్కున్నాడు. అతడిని సము ద్రంలోంచి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని హైమవతీ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటించాడు. రాక్షసుడు గుహలోకి వచ్చి కత్తి ఎత్తగానే, విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి పుట్టి రాక్షసుడ్ని సంహరించింది. ఆమెకు విష్ణువు ఏకాదశి అనే పేరు పెట్టాడని చెప్తారు.

విశేషాలు

విష్ణుమూర్తి తన ద్వారపాలకులైన జయ విజయులను ఉత్తర ద్వారాలు తెరచి ఈ రోజే లోపలకు పిలిచాడని పురాణాలు చెప్తాయి. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పింది కూడా ఈ రోజేనని అంటారు. ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక. విష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం వెనుక అంతర్యం ఇదే. తమలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తులు వేడుకుంటారు. వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధిచెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషమని చెప్పుకుంటారు భక్తులు.

చింతన

అయిదు పంచేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, ఒక మనసు.. కలిపితే పదకొండు అంటే ఏకాదశి.  దేవాలయం అంటే దేహమే అని చెప్తారు తాత్వికులు. కైవల్యోపనిషత్తు ప్రకారం మనిషి శరీరంలోని హృదయమనే గుహలోనే విష్ణుమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ రోజు ప్రతి మనిషిలో ఉన్న పరమాత్మ అయిన ఆ దేవుడ్ని ఆరాధించాలి. ఉపవాసం చేసి పంచేంద్రియా లను, కర్మేంద్రియాలను నిగ్రహించాలి. అంటే పాపాలు చేయకుండా ఉండాలన్నమాట.. మనసును కూడా ఏ చెడు ప్రభావాలకు లోనుకాకుండా చూసుకోవాలి. అప్పుడే దేహం నుంచి విముక్తి లభించి వైకుంఠానికి మార్గం సులభం అవుతుందని చెప్తారు భక్తులు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. ఈ రోజు స్వామివారిని వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వస్తారు. భక్తులకు కూడా ఈ ద్వారం గుండా దర్శనం చేసుకునే సౌకర్యం కలిగిస్తారు.

Also Read :- గోదాదేవి ఎవరు ? తిరుప్పావై పాశురాలు అంటే ఏమిటి?

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారం గుండా దైవదర్శనానికి అనుమతిస్తారు. తెలంగాణాలోని కొమరం భీమ్ జిల్లాలో ఉన్న బెజ్జూర్లో శ్రీరంగనాయక స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారు శేషతల్పముపైన శయనించి నాభిమధ్యన బ్రాహ్మణి కలిగి అనంత దేవ తామూర్తులతో కనిపిస్తాడు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి 3 రోజుల పాటు చేస్తారు. ఇక్కడ కూడా ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండానే దర్శనం చేసుకోవచ్చు. తెలంగాణ లోని మిగిలిన వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఉపవాసం

ఏడాది పొడుగునా ఉపవాసం చేయడం కంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే, అంతటి ఫలితం దక్కుతుందని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఈ రోజు ఉపవాసం చేసే వాళ్ళు ముందురోజు రాత్రి నుంచి ఏమీ తినకూడదు. జాగరణ చేయాలి. విష్ణుమూ ర్తిని స్మరిస్తూ, దేవుని పాటలు వింటూ మనసును ఆ దేవునిపైనే నిమగ్నం చేయాలి. ఆ రోజు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆలయానికి వెళ్లి విష్ణువును దర్శించుకుని రావాలి. తర్వాత ఉన్న దానిలో దానం చేయాలి. 

రాత్రికి భోజనం చేయాలి. అయితే ఈ రోజు అన్నం తినకూడదని కూడా చెప్తారు. ఎందుకంటే ముర రాక్షసు డు బియ్యంలో ఉంటాడని ఒక విశ్వాసం ఉంది. ఏకాదశి విష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి పూర్వం వైఖాసనుడు అనే రాజు ఈ ఉపవాస వ్రతాన్ని పాటించి పితృదేవతలకు విముక్తి కలిగించాడని. పురాణాలు చెప్తున్నాయి.  పూర్వం సుకేతు డనే రాజు, అతడి భార్య చంపక సంతానం లేకపోతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం. వల్ల కొడుకును పొందారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

–వెలుగు, లైఫ్​‌‌‌‌–