Holy 2025: త్యాగశీలి హోలిక

Holy 2025: త్యాగశీలి హోలిక

హోలీ పండుగ రోజున  రంగులు చల్లుకుంటూ  ఆనందోత్సవాలతో  పండుగ జరుపుకోవడం  రివాజు.  పురాణాల  ప్రకారం హోలీ పండుగకు ఒక ప్రాశస్త్యం ఉంది.  హిరణ్యకశ్యపుని  సోదరి హోలిక. ఆమె దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ వ్యాప్తిలోకి వచ్చిందని తెలుస్తోంది.  

దైవభక్తి  కలిగినవారికి కష్టాల నుంచి కాపాడి ఎల్లవేళలా దేవుడు రక్షణగా ఉంటాడని సందేశమిచ్చే హోలిక కథనమే... హోలీ జరపడానికి కారణమని హేమాద్రికాండ, భవిష్యత్ పురాణం,  ధర్మసింధు,  నిర్ణయసింధులు రుజువు చేస్తున్నాయి. హోలిక  రాక్షస వర్గానికి చెందినదిగా గుర్తించినప్పటికీ  వాస్తవానికి ఆదిమజాతి సంతతిలో పుట్టి,  తనకంటూ ఒక విశిష్టతను కలిగిన త్యాగధనురాలు.  బ్రహ్మదేవుడిని మెప్పించి మాయా వస్త్రాన్ని పొందిన ఘనత హోలికది.   

హిరణ్యకశ్యపుడు తన  కుమారుడైన  ప్రహ్లాదుడు  విష్ణుభక్తి పరాయణుడు కావడంతో ఆగ్రహించి,  అతడిని  ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేశాడు.  కానీ,  నిత్యం నారాయణ మంత్రం జపిస్తున్న ప్రహ్లాదుడు..  విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఎటువంటి 

ప్రాణాపాయం జరగకుండా క్షేమంగా ఉంటాడు.  హిరణ్యకశ్యపుడు  తన కుమారుడు  ప్రహ్లాదుడిని అంతమొందించేందుకు  ఒక ఉపాయం అలోచిస్తాడు.  బ్రహ్మదేవుడి వరం వల్ల హోలికకు మాయా వస్త్రం లభిస్తుంది.  ఎంతటి భయంకరమైన అగ్ని అయినా ఆ వస్త్రాన్ని ధరిస్తే ఆహుతి కాలేదు.  హోలికను ఆ వస్త్రాన్ని ధరించమని చెప్పి,  ప్రహ్లాదుడిని  ఆమె ఒడిలో  కూర్చోబెట్టి,  తన భటుల చేత  హిరణ్యకశ్యపుడు నిప్పు  పెట్టిస్తాడు.  

అయితే,  విష్ణుమూర్తి  మాయచేత హోలిక  కప్పుకున్న  ఆ వస్త్రం  గాలికి ఎగిరిపోయి  ఆమె దగ్ధమవుతుంది.  ప్రహ్లాదుడు మాత్రం క్షేమంగా  ప్రాణాలతో బయటపడతాడు. ఈ విధంగా హోలిక దగ్ధమైన వృతాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు. ఆనాటి  ఆదిమజాతి వారి ఔదార్యం, ఆత్మత్యాగాలు ఎంత గొప్పవో  పురాణాలను బట్టి అవగతమవుతున్నవి.  

- గుమ్మడి లక్ష్మీనారాయణ,సామాజిక రచయిత-