Telangana Tour : ఏకశిలపై వెలిసిన ఏకైక అమ్మవారు.. మన వరంగల్ భద్రకాళి అమ్మవారు.. విశిష్ఠత ఏంటో తెలుసుకుందామా..!

Telangana Tour : ఏకశిలపై వెలిసిన ఏకైక అమ్మవారు.. మన వరంగల్ భద్రకాళి అమ్మవారు.. విశిష్ఠత ఏంటో తెలుసుకుందామా..!

మనదేశంలోని పలు ఆలయాల్లో పార్వతీదేవి భద్రకాళిగా కొలువై ఉంది. ఈ దేవదేవికి మొక్కుకుంటే అన్నిరకాల బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. మన రాష్ట్రంలోని ఓరుగల్లులో ఉన్న భద్రకాళి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. 

ఏకశిలపై దర్శనమిచ్చే ఈ అమ్మవారు ఆదిమకాలం నుంచే ఉందని చరిత్రకారులు చెప్తారు. అంతేకాదు, దేశంలో కూర్చుని ఉన్న అన్ని భద్రకాళీ విగ్రహాల కంటే ఈ విగ్రహం అతి పెద్దది

వ రంగల్, హన్మకొండ రహదారిలో కొండల మధ్య ఉంది భద్రీతటాకం. ,,, ఆ తటాకం ఒడ్డునే భద్రకాళి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. కేవలం వరంగల్ ప్రాంతం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని కోర్కెలు తీర్చమని మొక్కుకుంటారు. ఈ ఆలయం ప్రతిరోజూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. 

Also Read : టీటీడీకు తెలంగాణ బీజేపీ అల్టిమేటం

కాకతీయుల ఇలవేల్పుగా పూజలందుకున్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. కాకతీయులకు పూర్వం మాతృస్వామ్య వ్యవస్థకు చెందిన ఆదివాసీలు కూడా ఈ అమ్మవారిని కొలిచారని చెప్పడానికి ఆధారాలున్నాయి. 

ప్రాచీనమైంది 

భద్రకాళి అమ్మవారు కాకతీయుల ఇలవేల్పుగా పూజలందుకుంది. చాళుక్యులు, కాకతీయులు ఈ అమ్మవారిని కాళీమాతగా భావించి పూజించారు. కానీ ఈ ఆలయం అంతకు ముందు నుంచే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 
ఆదివాసీలు భద్రకాళిని పూజించారని చరిత్రకారులు చెప్తారు. మాతృస్వామ్య వ్యవస్థకు ఈ ఆలయం, భద్రకాళి రూపం నిదర్శనం. క్రీ.శ. 625లో ఈ ఆలయాన్ని కట్టించినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. వేంగీ చాళుక్యులపై విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించాడని చెబుతారు. 

ఎందుకంటే.. చాళుక్య శిల్పకళా పద్ధతిలోనే ఏక శిలపై అమ్మవారిని చెక్కించారు. అలాగే ఆలయంలోని స్తంభాలు, ద్వారం. కాకతీయుల శిల్పకళలో కట్టినవే. ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరినప్పుడు భద్రకాళిని పూజించి హనుమకొండ వెలుపల ఉన్న తోటలో సేనలతో విడిది చేసినట్లు ప్రతాపరుద్రీయంలో ఉంది. అయితే కాకతీయుల పాలన అంతమైన తర్వాత ఈ ఆలయం వైభవాన్ని కోల్పోయింది. 1950లో మగన్ లాల్ సమేజ అనే వ్యాపారి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయించాడు. అప్పటి నుంచి ఈ ఆలయం మళ్లీ తన ప్రాభవాన్ని సంతరించుకుంది. ఆలయానికి ఎదురుగా ఒక చెరువు ఉంది. దీనిని భద్రకాళీ చెరువు అని పిలుస్తారు. 

అతి పెద్ద విగ్రహం 

భద్రకాళి అమ్మవారు నాలుక బయట పెట్టి రుద్ర రూపంలో కనిపించేది. నాలుక ఎర్రగా దూరం నుంచి చూడడానికే భయం కలిగించేది. ఈ విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తు, తొమ్మిది అడుగుల వెడల్పుతో ఒకే శిలపై చెక్కారు. ఎనిమిది చేతులలో ఆయుధాలు ధరించి శత్రువులను నాశనం చేసే శక్తి స్వరూపిణిగా భద్రకాళి భక్తులకు దర్శనమిస్తుంది. 

కుడివైపు చేతుల్లో కరవాలం, ఛురిక, ఢమరకం, జపమాల ఉన్నాయి. ఎడమ చేతుల్లో గంట, త్రిశూలం, తల, పాత్ర ఉన్నాయి. మనదేశంలో కూర్చుని ఉన్న విగ్రహాల్లో ఈ భద్రకాళి విగ్రహం అత్యంత పెద్దది. అయితే పునరుద్ధరణ సమయంలో భక్తులు అమ్మవారిని చూసి భయపడుతున్నారని అమ్మవారి నోట్లో బీజాక్షరాలు రాసిన యంత్రాన్ని అమర్చారు. ముఖంలో రౌద్ర రూపాన్ని తగ్గించి, ప్రసన్నంగా కనిపించేటట్లు మార్చారు. నుదుటి మీద విభూతి రేఖ, ముక్కుపుడక అమర్చారు.. 

చిన్న ఆలయాలు 

భద్రకాళి ఆలయంలో అనేక చిన్నచిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ దేవతను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్లు, మిగిలిన ఆలయాల్లోని దేవతలను కూడా దర్శించుకుంటారు. ధ్వజస్తంభం, బలిపీఠం, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయస్వామి, సింహవాహనం మహామండపంలో ఉన్నాయి. ఆలయంలోనే ఉన్న మందిరంలో సరస్వతి.. లక్ష్మీ, దుర్గ విగ్రహాలున్నాయి. ఆలయానికి కొద్ది దూరంలో నాగేంద్రుడు, గణపతి దేవాలయాలు భక్తులకోసం నిర్మించారు. అలాగే శివపార్వతుల విగ్రహాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 

శివపార్వతుల చుట్టూ ఎనిమిది మంది లక్ష్ములు, అనేకమంది దేవతల ప్రతిమలు, గణపతి... ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన వాళ్లు, భద్రకాళితో పాటు మిగిలిన దేవుళ్లను. దేవతలను దర్శించుకుని సంతృప్తి పొందుతారు. 

పూజలు 

రాజులు యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించి విజయం చేకూర్చమని ప్రార్థించి వెళ్లే వాళ్లు. యుద్ధం నుంచి వచ్చాక అమ్మవారికి పూజలు నిర్వహించేవాళ్లు. అదే విధంగా యుద్ధ సమయంలో భద్రకాళికి తాంత్రిక పూజలు చేసేవాళ్లని చరిత్ర వల్ల తెలుస్తుంది. 

ఈ ఆలయం దగ్గరున్న గుహల్లో ఇప్పటికీ సిద్ధులు ఉన్నారని స్థానికులు చెప్తారు. ప్రస్తుతం ప్రతిరోజూ చండీహోమం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొంటే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలోని దేవతా మూర్తులకు ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. వేదపాఠశాల కూడా నడుపుతున్నారు. 

గర్భాలయానికి రెండు వైపులా చిన్న గదులు కనిపిస్తాయి.. ఈ ఆలయంలో చాలా విగ్రహాలు భూమికి సమానంగా ఉండటంతో ఇవి కూడా అమ్మవారి విగ్రహం అంత ప్రాచీనమైనవని చరిత్రకారులు అంటున్నారు. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు. మాఘ నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలు... ఈ ఆలయంలో నిర్వహిస్తున్నారు.

-వెలుగు, లైఫ్​‌‌–