ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. కానీ ఇప్పుడు నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్నారు. భాషతో పనిలేకుండా ప్రతి మనిషి పలకరింపు నవ్వు. అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
నవ్వు ఒక మంచి అనుభూతి. కానీ నవ్వు ఆరోగ్యాన్ని మెరుగు పరిచే మంచి వ్యాయామం కూడా. నవ్వడం ఒత్తిడి నుంచి, శారీరక, మానసిక బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కలిగించడం ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.నవ్వు సార్వత్రిక భాష. నవ్వుతో ఆరోగ్యం, ఆనందం, శాంతి సాధ్యపడుతాయి. భాషతో పనిలేకుండా ప్రతి మనిషి పలకరింపు నవ్వు. .అసలు నవ్వకుండా మనిషి ఉండలేరా? అని సందేహం వచ్చే ఉంటుంది.
పిల్లలు పుట్టగానే ఆందరూ నేర్పే తొలి విద్య నవ్వడం. బోసి నోటితో బుజ్జాయులు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటారో చెప్పనక్కరలేదు. ఊయలలో ఉన్నవారిని నవ్వించేందుకు కొత్త శబ్దాలు, పద ప్రయోగాలు చేస్తుంటాం. అంతేకాదు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారిని అందరూ ఇష్టపడుతుంటారు. అంతేకాదండీ పక్కవారిని ఎప్పుడు నవ్వించేవారిని కూడా చాలా మందిని ఇష్టపడుతుంటారు.
లాఫింగ్ డే ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా
మానసిక ఒత్తిడి తగ్గించి ఆయుష్షును పెంచేదే నవ్వు. అందుకే ప్రతి ఒక్కరు రోజులో కనీసం అరగంట అయిన నవ్వకపోతే అనారోగ్యానికి గురువుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 1998 నుంచి ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుతున్నారు. ముంబైలోని డా. మదన్ కటారియా 1998లో ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరిపారు. నవ్వుల యోగా ఉద్యమాన్ని నవ్వు వల్ల మనిషి హావాభావాల్లో వచ్చే మార్పును, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేయటానికి ఈ రోజును ప్రారంభించారు. ఇందుకోసం భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా 6వేలకు పైగా లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడం, మారుతున్న జీవనశైలి, ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా లాఫింగ్ క్లబ్ లు , అందులో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.నవ్వు ప్రభావం ముఖకవళికలు, భావోద్వేగాల మీద గణనీయమైన ప్రభావం చూపుతాయనే అవగాహన కలిగించడం ఈ ఉద్యమ లక్ష్యం. నవ్వు ద్వారా సోదరభావాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యవచ్చనే స్పృహను వ్యాప్తి చేస్తున్నారు.
డెన్మార్క్‌లో 2000 సంవత్సరం HAPPY-DEMIC పేరుతో మొదటిసారి మనదేశానికి వెలుపల జరిగిన మొదటి నవ్వుల దినోత్సవం. ఇది కోపెన్హాగన్ లోని టౌన్ హాల్ స్క్వైర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 10000 మందికి పైగా ప్రజలు ఒకచోట చేరారు. ఇది అతి పెద్ద సమావేశంగా చెప్పుకోవచ్చు. లాఫ్టర్ క్లబ్‌లో కామెడి సినిమాలు, స్టాండప్ కమెడియన్ల కామెడీ షోలు కూడా చూడవచ్చు. స్టాండప్ కమెడియన్ గా టాలెంట్ పెంచుకునేందుకు అవసరమయ్యే క్లాసులు కూడా ఈ లాఫ్టర్ క్లబ్ ల ఆధ్వర్యంలో జరుగుతాయట. సోషల్ మీడియా ద్వారా జోకులు పంచుకోవచ్చు. స్నేహితులతో కలిసి కామెడి సినిమాలు చూడవచ్చు. పార్కుల్లో సమావేశమై నవ్వుల యోగాభ్యాసం కూడా చేస్తారు.
ఇవి తెలుసా
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన, ఎవ్వరితోనైనా మాట్లాడగలిగే భాష నవ్వే.
గిలిగింతలకీ, జోక్స్ వేసినప్పుడే కాదు, నైట్రస్ ఆక్సైడ్ పీల్చినప్పుడు, కొన్ని మాదక ద్రవ్యాలు వాడినప్పుడు కూడా బిగ్గరగా నవ్వుతారు. అందుకే నైట్రస్ ఆక్సైడ్ ని నవ్వుల వాయువు అని పిలుస్తారు.
మనషులే కాదు. కుక్కులు, కోతులు, గొరిల్లాల వంటి జంతువులు నవ్వుతూ ఉంటాయి.
ఎవ్వరూ నవ్విన మనల్ని చూసే నవ్వుతున్నారని బాధపడటం రుగ్మత. దీన్ని “జెలటో ఫోబియా” అంటారు.
నవ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. అవేమిటో తెలుసుకుందాం.
- ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
- నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఫలితంగా తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుంది.
- గుండెకు రక్షణ ఇస్తుంది. రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తుంది. ప్రసరణ మెరుగవుతుంది.
- నవ్వడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. రోజుకు 10, 15 నిమిషాలు నవ్వగలిగితే 40 క్యాలరీల వరకు ఖర్చవుతాయి.
- 15 నిమిషాల నవ్వు రెండుగంటల నిద్రతో సమానం.
- నవ్వుతూ బతికేవారి ఆయుప్రమాణాలు మెరుగవుతాయి.
- కోపాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.
- నవ్వుతో కండరాలు రిలాక్స్ అవుతాయి.
- నవ్వు సహజమైన వ్యాయామం. ఇదొక కాంప్లిమెంటరీ క్యాన్సర్ థెరపి. క్యాన్సర్ మీద నవ్వు ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- నవ్వు రక్తంలో ఆక్సిజన్‌ను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరగుపరుస్తుంది. సృజనాత్మకత పెంచుతుంది.
- నవ్వితే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ సెల్స్ వృద్ది చెందుతాయట.
- ప్రతిరోజు నవ్వడానికి కొంతసమయం కేటాయించండి. స్నేహితులతో జోక్స్ వేయండి ఆరోగ్యంగా ఉండండి.
- నవ్వితే మీ పొత్తి కడుపు, ముఖంలోని కండరాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.
- మనిస్తే చార్లీ చాప్లిన్, మిస్టర్ జీన్ వంటి వారికి హేటర్స్ అసలు ఉండరు. స్టాండప్ కామెడీయన్స్ ని వ్యతిరేకించేవారు తక్కువమంది ఉంటారు.
- ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంగతుంది.
చిన్నపిల్లలు మాట్లాడుకుంటే భలే ఉంటుంది. ఇద్దరు గడుగ్గాయిలు మాట్లాడుకోవడం విన్నామంటే పొట్ట చెక్కలు అవ్వడం ఖాయం. ఓ గడుగ్గాయి పక్కనే ఉన్న మరొకడికి ఇలాచెప్పాడు. చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. తెలుసా? రెండో వాడు అడిగాడు అవునా.. ఎందుకు? వెంటనే మొదటి వ్యక్తి సీరియస్ గా ఇలా చెప్పాడు. ఎందుకేంట్రా.. చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలు పెడుతుంది. దాంతో కడుపులో చక్కిలిగిలి పుడుతుంది.
నిజమే కదా చిన్నారులు వారికీ తెలిసీ తెలియక చెప్పే మాటలు మనకి రిలీఫ్ ని ఇస్తాయి. మన చుట్టూ కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు ఎన్నో మాట్లాడుకుంటారు. కుదిరితే పిల్లలతో స్నేహం చేసి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సైన్స్ ప్రకారం మనకంటే చిన్న వారిని పరిచయం చేసుకోవడం వల్ల మన తర్వాత జనరేషన్ గురించి కూడా తెలుసుకోవచ్చు. వారితో కలిసిపోయి ఆడుకొని చూడండి. వారి మాటలు, చేష్టలు అన్ని నవ్వు తెప్పిస్తాయి. కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి.