ఆధ్యాత్మికం: వ్యాసుడు ఇక్కడే పురాణాలు రాశాడు.. ఎక్కడో కాదు.. తెలంగాణలోనే..

ఆధ్యాత్మికం:  వ్యాసుడు ఇక్కడే పురాణాలు రాశాడు.. ఎక్కడో కాదు.. తెలంగాణలోనే..

మహాభారతాన్ని రాసిన వ్యాస భగవానుడు నిర్మించిన క్షేత్రం బాసర. ఇది ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వ్యాసపురి విరాజిల్లుతోంది. అక్షరాభ్యాసం కోసం బాసరకు వచ్చిన భక్తులు.. ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్లలో ఉన్న విశేషాలను కూడా చూడాలనుకుంటారు. అపూర్వ శిలా కట్టడాలు, గుహలు అబ్బురపరిచే రాతి మండపాలు.. ఇలా ఎన్నో ఉన్నాయి.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .

వ్యాస మహర్షి తపస్సుచేయడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆయన బ్రహ్మాండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు.. అందులో ప్రకృతి ఖండంలోని 'శక్తి'ని వర్ణించాల్సి వచ్చింది. 'శక్తి'ని వర్ణించాలంటే ఆయనకు ఉన్న శక్తి సరిపోలేదు. అందుకే మరింత తపశ్శక్తితో పాటు, ప్రశాంత వాతావరణం అవసరమని భావించాడు. అలాంటి వాతావరణం కోసం అన్ని ప్రాంతాలూ తిరుగుతూ... చివరకు బాసరకు వచ్చారు. 

గోదావరి నాభిస్థానం (నాందేడ్ నుంచి బ్రహ్మేశ్వరం వరకు ఉన్న ప్రాంతం)లోని తీరంలో ధ్యానముద్రలో ఉన్న వ్యాసునికి 'శక్తిరూపం' నీడలా కనిపించి వెంటనే మాయమైందట. .దీంతో ఆ రూపం ఎవరిదా? అని దివ్యదృష్టితో చూడగా జ్ఞానసరస్వతి అమ్మవారు కనిపించారట. అయితే.. పూర్తి రూపం ఎందుకు కనిపించలేదని అమ్మవారిని అడగ్గా.. అప్పుడు అమ్మ ఋషితో... ప్రతిరోజూ ధ్యానంచేసి, గోదావరి నుంచి పిడికెడు ఇసుక తీసుకొచ్చి ఒకచోట వేయాలని, ఆ ఇసుకతో తన పూర్తి రూపం తయారవుతుందని చెప్పారట. 

దాంతో వ్యాసుడు గోదావరి తీరానికి కొంతదూరంలో ఉన్న కుమారచర పర్వతంలోని ఒక గుహలో తపస్సు మొదలుపెట్టాడు. అమ్మవారు చెప్పినట్టు ఇసుక తీసుకొచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేశాడు. ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత అమ్మవారి రూపం కనిపించింది. ఆ రూపమే జ్ఞాన సరస్వతీ అమ్మవారిగా విరాజిల్లుతోంది. అందుకే బాసరసు జ్ఞానానికి పుట్టినిల్లుగా చెప్తుంటారు. 

కాశ్మీర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో సరస్వతీ ఆలయాలు ఉన్నప్పటికీ.. జ్ఞానసరస్వతీ ఆలయం మాత్రం బాసరలో మాత్రమే ఉందని...దేశంలో మరెక్కడాలేదని చెప్తుంటారు. కుమారచర పర్వతం ఇప్పుడున్న ఆలయంలోని గుట్ట పైభాగంలో ఉంది. బాసరకు వచ్చిన భక్తులు చాలామంది దానిపై ఉన్న వ్యాసముని గుహను కూడా దర్శించుకుంటారు. 

పాప హరేశ్వర ఆలయం

ఇది బాసర గ్రామంలో ఉంది.  కొండ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయం సరస్వతి ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది.  పూర్తిగా రాతి మండపంతో ఉండే ఈ ఆలయం బాసర చరిత్రకు చిహ్నంగా మిగిలిపోయింది. దీన్ని చోళులు కట్టించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆలయంలోని రాతి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి శిలలపై ఉన్న శాసనాలు ఏ భాషలో రాశారు. లిపి ఏంటో... ఇప్పటికీ తెలియలేదు. గతంలో ఈ ఆలయంలో భూగర్భ గుహలు ఉన్నట్లు చరిత్ర చెప్తుంది. ఆ గుహల నుంచి బాసరలో ఉన్న దత్తాత్రేయ ఆలయంలోకి, జ్ఞాన సరస్వతి ఆలయంలోకి మార్గాలు ఉండేవి. ఈ భూగర్భగుహలు ప్రస్తుతానికి మూత పడిపోయాయి. వీటిని అప్పట్లో రాజులు ఉపయోగించే వాళ్లు. 

మక్కాజీ పటేల్ 

అప్పట్లో ప్రతి పుణ్యక్షేత్రానికి ఓ వీరుడు కాపలాగా ఉండేవాడని పెద్దలు చెప్తుంటారు. అలా... బాసర ఆలయానికి కూడా మక్కాజీ పటేల్ సంరక్షకునిగా ఉండేవాడు. నిజాం హయాంలో రజాకార్లు సరస్వతీ ఆలయంపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు బాసర దగ్గరలోని రేణుకాపూర్ (ఇప్పుడు బాసరలో కలిసిపోయింది) గ్రామ పట్వారీగా ఉన్న మక్కాజీ పటేల్ రజాకార్ల దాడిని ముందుగానే పసిగట్టి ప్రజలను, యువకులను తయారు చేశాడు. దాడికి వచ్చిన రజాకార్లను ఎదిరించి పోరాడాడు. అందుకే ఆయన వీరగాథలను మర్చిపోకుండా ఆలయంలో శిలపై తన ప్రతిమను చెక్కించారు గ్రామ పెద్దలు. మక్కాజీ పటేల్ విగ్రహానికి కూడా ఇప్పటికీ పూజలు చేస్తున్నారు.. 

సీతమ్మ నగల గని వేదవతి శిల 

సీతమ్మ వనవాసంలో ఉన్నప్పుడు గోదావరి నది తీరాన ఉన్న వేదశిలలో తన నగలను భద్రపరిచినట్లు చెప్తుంటారు. అది ఇప్పుడు బాసర ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న బాసర గ్రామ బస్టాండ్ ఎదురుగా ఉంది. ఈ శిలను తడితే ఒక్కో వైపు ఒక్కో శబ్దం వస్తుంది. చిన్న బండతో కొడితే బిందెను కొట్టినట్టు శబ్దం వస్తుంది. చాలామంది భక్తులు వేదవతి శిలను కూడా దర్శించుకుంటారు
 
-–వెలుగు,లైఫ్​–