కార్తీకమాసం కొనసాగుతుంది. ఇప్పటికే మూడు సోమవారాలు..ఏకాదశి.. పౌర్ణమి తిథులు ముగిశాయి. వనభోజనాల సందడి ఊపందుకుంది. వనభోజనాల గురించి కార్తీక పురాణంలో కూడా ఉంది. కార్తీకమాసంలో నైమిశారణ్యంలో మునులందరూ సూతమహాముని ఏర్పాటు చేసిన వనభోజనాలు చేశరని పండితులు చెబుతున్నారు. మహర్షులు.. మునులు అందరూ ఉసిరి చెట్టు కింద పరమేశ్వరుడిని.... విష్ణుమూర్తిని పూజించి.. షోడశోపచారాలతో పూజలు చేసి వనభోజనాలు చేశారు. ఇలా మొదలైన వనభోజనాల కార్యక్రమంలో నేడు హైటెక్ యుగంలో పిక్ నిక్ పేరుతో ఎంజాయి చేస్తున్నారు.
ఆథ్యాత్మిక గ్రంధాల ప్రకారం వన భోజనాలు అంటే వ్రతాలు.. పూజలు .. పురాణ కాలక్షేపం చేస్తూ.. దేవుడికి నివేదన సమర్పించి .. తరువాత అందరూ కలిసి చెట్టు కింద భోజనాలు చేయాలి. పూర్వకాలంలో చాలామంది ఈ వేడుకను ఇలానే స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి నిర్వహించుకొనేవారు. ఈ వనభోజనాలు.. ఆధ్యాత్మిక చింతనతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయని పండితులు చెబుతున్నారు.
ఆయుర్వేద గ్రంథాల ప్రకారం.. ఉసిరి చెట్టు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఉసిరి చెట్టు గాలి పీలిస్తే అనేక వ్యాధులు దరి చేరవని చెబుతున్నారు. సాధారణంగా కార్తీకమాసంలో మంచు కురుస్తుంది, ఈ సమయంలో ఉసిరి చెట్టు కింద.. విష్ణుభగవానుడిని పూజించి... ఆ చెట్టు కిందే కూర్చొని భోజనం చేస్తే ఎంతో పుణ్యమని కార్తీక పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజిస్తే అశ్వమేధ యాగం వలన వచ్చే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక మాసంలో సెలవు రోజులు... ఆదివారాలు,, దగ్గర్లోని నదీ తీరప్రాంతాల్లో.. తోటల్లో అందరూ కలిసి సంతోషంగా గడుపుతారు. నేటి యువతరం కొంతమంది ఎంతో పవిత్రమైన వనభోజనాల కార్యక్రమాన్ని పిక్ నిక్ పేరిట అపహాస్యం చేస్తున్నారు.