గణపతి నవరాత్రి ఉత్సవాలు : ఏ రోజు ఎలా పూజించాలి.. నైవేద్యం ఏమి పెట్టాలో తెలుసా..

మన సంప్రదాయంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు . రెండోవి భాద్రపదంలో గణపతి నవరాత్రులు, మూడోవి ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు. అయితే  పల్లెపల్లెలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. అయితే, ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా, శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది. గణపతి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవాతర వినాయకుడిని ఆవాహన చేయాలి... దాని  విశిష్టత ఏంటి.. ఏ పదార్దం నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను  పూర్తిగా తెలుసుకుందాం. . . . 


1వ రోజు ( భాద్రపద శుద్ధ చవితి) .. వరసిద్ది వినాయకుడి ఆవాహన చేసి పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి. వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి. చవితినాటి చంద్రుణ్ని చూసినవారికి నీలాపనిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడటం కోసం ఈ కథ చదువుకుని అక్షతలు తలమీద వేసుకోవాలి. అక్షతలను మనమే ధరించాలి తప్ప, భగవంతుడిపై వేయకూడదు. ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు. నవరాత్రులు జరిపేవారు మాత్రం ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని ఆవాహన చేసి పూజించాలి. 

2వ రోజు(భాద్రపద శుద్ధ పంచమి).. వికట వినాయకుడిని పూజించాలి.  లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి.  స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. కామాసురుడు మయూరరూపం ధరించి, లోకమంతటినీ కామంతో ప్రభావితం చేస్తూ… గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. గణపతి ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిరోహించాడు. నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు, మునులు, ‘మయూరవాహనా! వికట వినాయకా!’ అని స్తుతించారు. అటుకులు నివేదించి స్వామిని తృప్తి పరిచారు. రెండోనాటి పూజ ద్వారా సమాజం దుష్ట కామాన్ని వీడాలి.

3వ రోజు (భాద్రపద శుద్ధ షష్ఠి)...  లంబోదర వినాయకుడిని పూజించి పేలాలను నైవేద్యంగా సమర్పించాలి. క్రోధాసురుణ్ని వధించిన లంబోదరుడిని మూడోనాడు షోడశోపచారాలతోనూ, అష్టోత్తర శతనామావళితో గానీ, సహస్ర నామావళితోనూ పూజించాలి. . శుక్రాచార్యుని నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేశాడు. ముల్లోకాలనూ జయించే శక్తిని, మృత్యురాహిత్యాన్ని, లోకప్రసిద్ధిని వరాలుగా పొందాడు. ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు. అతని భార్య ప్రీతి. క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు. దాంతో దేవతలు, మునులు లంబోదరుడిని ఆశ్రయించగా, ఆయన క్రోధాసురుని పీచమణిచాడు. క్రోధాసురుడు లంబోదరుడిని శరణువేడాడు. ఆయన అనుగ్రహించాడు. దుష్టశిక్షణాదులందు తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి, క్రోధుని తన నేత్రాల్లో ఇమిడి పొమ్మన్నాడు. ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యాకార్య విచక్షణ కోల్పోతారు. కాబట్టి ఎవ్వరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు. మూడవరోజుపూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం.

4వ రోజు (భాద్రపద శుద్ధ సప్తమి) .. నవరాత్రుల నాలుగోరోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడయిన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి. విశ్వబ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారుసోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు.   లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయ వరాలు పొందుతాడు. లాలస అనే కన్యను వివాహమాడతాడు. దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైభ్యుడనే మునిని ఆశ్రయిస్తారు. ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు. వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు. శివ, శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు. దాంతో లోభాసురుడు గజాననుడి శరణు వేడాడు. గజానన వినాయకుడు లోభుడిని పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు. ధర్మవిరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు. నాలుగోరోజున గజానన వినాయకుడి పూజ పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే.

5వ రోజు ( భాద్రపద శుద్ధ అష్టమి).. మహోదర వినాయకుడిని గణపతి నవరాత్రిళ్లలో ఐదవరోజున పూజించి నివేదనగా కొబ్బరి కురిడిని సమర్పించాలి.  శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియశిష్యుడు ఉండేవాడు. గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి, మహాశక్తిమంతుడిని చేశాడు. అతను మదిర అనే రాక్షసకన్యను పెండ్లాడతాడు. మూషికాసురుడు మోహాసురుణ్ని గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. ముందుగా తన చెరనుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెబుతాడు. మోహాసురుడు అలాగే చేస్తాడు. ఇదంతా గమనించిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజు దీనికంతటికీ మూలకారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు. సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్లి, ప్రవాళ గణపతిని పూజిస్తాడు. గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు. భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు. నన్ను నీలో కలుపుకోవాల్సిందని వేడుకుంటాడు. అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది. ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది. కాబట్టి అయిదోనాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే.

6వ రోజు (భాద్రపద శుద్ధ నవమి) ...  ఏకదంత వినాయకుడిని ఆరవరోజు పూజించి నువ్వులు/ నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.  దేవతలు, రుషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలిచాడు. సింహం ఆ అసురునిపై లంఘించి, వాడి గొంతును నోట కరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణగి ఏకదంత గణపతిని శరణువేడాడు. గణపతి వాడికి అభయమిచ్చి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధిచెప్పి, పాతాళానికి పంపుతాడు. ఆరోరోజుపూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే.

7వ రోజు( భాద్రపద శుద్ధ దశమి) ...వక్రతుండ వినాయకుడిని ఏడవరోజు  పూజించి అరటి పండ్లతో పాటు ఇతర రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.  మూషికాసురుడు మత్సరాసురుడిని గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు. ఆ అసురుడు సింహరూపం పొంది, గణపతి మీదికి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడుతాడు. వక్రతుండ గణపతి కనికరించి, ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు.  ఏడవరోజు పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడటమే.

8వ రోజు (భాద్రపద శుద్ధ ఏకాదశి) ... విఘ్నరాజ వినాయకుడిని ఎనిమిదవరోజు పూజించి సత్తుపిండిని నైవేద్యం పెట్టాలి. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి, ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విష వాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పంకూడా తొండంలో చొరబడింది. దానిని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి. గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పొలుసులు నుగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు, ‘గణేశా! శరణు. నీకు సోదరుడను. ప్రాణభిక్ష పెట్టు’ అంటూ ప్రాధేయపడటంతో గణపతి కరుణించాడు. మమతాసురా! నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు!’ అన్నాడు. పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే! పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే ఎనిమిదవరోజు పూజ అంతరార్థం.

9వ రోజు (భాద్రపద శుద్ధ ద్వాదశి) ..  ధూమ్రవర్ణ వినాయకుడిని చివరి రోజు తొమ్మిదవ రోజు ఆవాహన చేసి అర్చించి..  నేతి అప్పాలను నివేదనగా సమర్పించాలి.  . ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు. దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి, స్వామి శరణాగతుడయ్యాడు. గణేశుని అర్చించే వారి జోలికి రానని చెప్పి, ధూమ్రవర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. ఈ తొమ్మిదోనాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే.