కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత  ఏమిటి..  ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..

కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత  ఏమిటి..  ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..

దసరా.. దీపావళి పండుగలు ముగిశాయి. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈ ఏడాది ( 2024) నవంబర్​ 2న ప్రారంభం కానుంది.  ఈ నెలలో పరమేశ్వరుడిని ఆరాధిస్తారు.  అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది... విశిష్టమైనదని స్కంద పురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నారు. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.

కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుడిని పూజిస్తారు.  ఇక సోమవారాలు.. ఏకాదశి.. పౌర్ణమి రోజులలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు.  ఉపవాస దీక్షలు చేసి ఆ భోళా శంకరుడి అనుగ్రహం పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈ మాసంలో చంద్రుడు    కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు.  అందువలనే ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. తెలుగు మాసాల్లో కార్తీక మాసం 8వ నెల. కార్తీకమాసం అధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న నెల. ఇటు శివుడికీ.. అటు విష్ణువుకీ ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం కార్తీక మాసం.  కార్తీక మాసం ప్రాముఖ్యతను స్కంద పురాణంలో వివరంగా వివరించారు. దానిప్రకారం కార్తీకమాసం వంటి మాసం మరోటి లేదు. 

క్రోధి నామ సవంత్సరంలో నవంబర్​ 2 నుంచి నెల రోజులపాటు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.  అభిషేకాలు, బిల్వార్చనలు చేసి పరమేశ్వరుని అనుగ్రహం కోసం భక్తులు పరితపిస్తూ..  జాతక రీత్యా ఉన్న దోషాలు.. బాధలు తొలగిపోవాలని కోరుకుంటూ.. శివుడిని ప్రార్థిస్తారు.  అంతేకాక ఈ నెలలో  చాలామంది లక్ష పత్రి పూజ కూడా నిర్వహిస్తారు.  ఈ నెలలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వలన స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని.. ఇక మరల జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.  

 కార్తీక మాసంలో ఏదైనా పవిత్ర నదిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన పుణ్యమాసంలో, ఇంటి మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు. ఈ స్నానం అవివాహితులు, వివాహితులైన మహిళలకు ప్రత్యేకంగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీరు నది ఒడ్డున స్నానం చేయలేకపోతే, మీ స్నానపు నీటిలో ఏదైనా పవిత్ర నది నీటిని కలపడం ద్వారా మీరు స్నానం చేయవచ్చు.

కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంతాకాదు.  ఆ రోజున ( నవంబర్​ 15) నదుల్లో స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.   కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటారు.పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి.. నదుల్లో వదులుతారు.   సోమవారాలు ఉసవాస దీక్షను ఆచరిస్తారు.  కార్తీకమాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినది.  కార్తీక  మాసంలో శివాలయంలో పూజలు చేసిన వారికి.. ప్రదోష కాలంలో శివారాధన చేసిన వారికి విశేషమైన ప్రాముఖ్యతతో పాటు..  ఈతి బాధలు తొలగిపోతాయి.  శివాలయానికి వెళ్ళి పూజలు చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని, ఈతి బాధలు ఉండవని నమ్ముతారు. ప్రదోష కాలంలో చేసే శివారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే సాయంత్రం వేళ భక్తులు గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. 

కార్తీక మాసంలో దీప దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొత్తం నెలలో, పవిత్ర నది లేదా తీర్థయాత్ర స్థలం లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర రోజువారీ దీపం దానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు శరద్ పూర్ణిమ నుండి ప్రారంభించి ప్రతిరోజూ దీపదానం చేస్తారు. దీపాన్ని దానం చేయడం ద్వారా, ఇంటి చీకటి మాత్రమే కాకుండా, జీవితంలోని చీకటి కూడా తొలగిపోతుందని.. తల్లి లక్ష్మి సంతోషించి, సాధకుని ఇంటిని సంపద.. ఆహారంతో నింపుతుందని నమ్ముతారు.

ALSO READ :  Deepavali 2024:  దీపావళి పండుగ వెనుక పురాణ కథలు ఇవే..

హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కను ఎంతోపవిత్రంగా  భావించిపూజలు చేస్తారు.    ఏడాది పొడవునా దైవ ఆరాధనలు చేస్తాము. కానీ, కార్తీక మాసంలో తులసి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో, తులసి నివారణ అని చెప్పారు. కార్తీక మాసంలో ఒక నెల పాటు తులసి ముందు దీపం ఉంచడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే   కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నివాసంగా పేర్కొంటారు. అందుకే ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం చేస్తారు. వీటినే వన భోజనాలు అంటారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు.