![Maha Shivratri 2025: మహా శివరాత్రి ఎప్పుడు?.. ఆరోజు ప్రాముఖ్యత ఏమిటి.. ఏంచేయాలి..](https://static.v6velugu.com/uploads/2025/02/significance-and-importance-of-mahasivararti_UJtnmVK8iS.jpg)
మహా శివరాత్రి శివ భక్తులకు చాలా ప్రత్యేకమైన రోజు. సంవత్సరం ఫిబ్రవరి26l జరుపుకోబోయే మహా శివరాత్రి తేదీ, పూజ చేయడానికి అనువైన సమయం.. ఉపవాసం ఎలా ఉండాలి, మహా శివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
ఈ సంవత్సరం ( 2025) మహాశివరాత్రి ఫిబ్రవరి 26, బుధవారం నాడు వచ్చింది. చతుర్దశి తిథి ఆరోజు ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 27న ఉదయం 8:54కి ముగుస్తుంది. 26 వతేది ఉపవాసం ఉండి, జాగరణ, లింగోద్భవం చూసే భక్తులు... 27వ తేదీ ఉదయం 6:48 నుంచి 8:54 AM మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు.
ఆ రోజున ( ఫిబ్రవరి 26) శివభక్తులు ఉపవాసం, జాగరణ ఉండి, రోజంతా శివనామస్మరణ చేస్తారు. శివుడికి అభిషేకం చేయడంతో పాటు.. బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తారు.
ALSO READ | జ్యోతిష్యం: ఫిబ్రవరి 27 న మీనరాశిలోకి బుధుడు... రాహువుతో కలయిక... 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!
మహా శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు . మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేశాడని నమ్ముతారు. ఈ తాండవం సృష్టి, స్థితి, లయలకు సంకేతం. విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు. జీవిత చక్రం, కాలగమనం.. ఇలా అన్నింటినీ గుర్తు చేసే శక్తివంతమైన రోజు ఇది.
మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి. కానీ, ఆధ్యాత్మికంగా మాత్రం ఎంతో శక్తివంతమైనవి. మహాశివరాత్రి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. పండ్లు, నీరు, లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. కొందరు కఠినంగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తారు. ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు.
ఓం నమః శివాయ... శివ తాండవ స్తోత్రం... వంటి శివ మంత్రాలను జపిస్తూ ధ్యానం చేస్తారు. శివలింగానికి పాలతో, నీటితో, తేనెతో, పెరుగుతో, నెయ్యితో.. చెరుకరసంతో అభిషేకం చేస్తారు. బిల్వ పత్రాలు, పువ్వులు సమర్పిస్తారు. చాలా మంది భక్తులు రాత్రంతా మెలకువగా ఉండి భజనలు చేస్తారు. శివుడి దివ్యమైన అనుభూతి కోసం ప్రార్థనలు చేస్తారు.
మహాశివరాత్రి మనసులోని చీకట్లను తొలగించే పర్వదినం అని....ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శాంతి, శక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. గత జన్మల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని నమ్ముతారు.మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివగౌరిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని, సంపద, కీర్తి, శాంతి, సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు.