అగ్గిపూలు..మోదుగు పూలు.. ప్రకృతి వరం.. మదిని దోచేస్తాయిగా..!

 అగ్గిపూలు..మోదుగు పూలు.. ప్రకృతి వరం..  మదిని దోచేస్తాయిగా..!

చెట్లన్నీ ఆకులు రాల్చుతున్నాయి. చెట్ల  పచ్చదనం రోజు రోజుకు తగ్గిపోతుంది.  అడవి కళ తప్పింది. అప్పుడే మోదుగ పూలు వికసించాయి.వేసవి కాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో మోదుగ పూలు విరివిగా పూస్తాయి అడవంతా ఎర్రని కాంతితో కళకళలాడుతుంది. విరగబూసిన అందం అడవికే వన్నె తెచ్చింది. పక్షులు ఆ రంగును చూసి మురిసిపోయి.. పూలను ముద్దాడుతున్నాయి. సూర్య కిరణాలకు ఆ పూలు కాంతి పుంజాల్లా వెలిగిపోతున్నాయి. . .

మోదుగు పూలు ఫిబ్రవరి.. మార్చి నెలల్లో ఎక్కువగా పూస్తాయి. ఈ పూలు కొన్ని మైదాన ప్రాంతాల్లో చెట్టు కూడా కనిపించనంతగా విరగబూస్తాయి. వీటి అందాలను ఎంత చూసినా తనివితీరదు.. అందుకే ఈ చెట్టును 'ప్లేమ్ ఆఫ్ ఫారెస్టు" అని పిలుస్తారు. ఈ పూలను కొన్ని ప్రాంతాల్లో గోగుపూలు  అని కూడా పిలుస్తుంటారు. 

ఈ చెట్టు పొలంగట్లపై, రోడ్ల పక్కన పెరుగుతాయి. మండు వేసవిలో కూడా ఎర్రని కాంతితో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. మోదుగపూలు శివుడికి ఎంతో ఇష్టమైనవది పండితులు చెపుతుంటారు. వీటిని ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. హోలీ సందర్భంగా చల్లుకునే రంగులను కూడా ఈ పూలతోనే తయారు చేస్తారు. 

అంతేనా.. కవులు ఈ పూలను అభ్యుదయ సూచికలుగా వర్ణించారు. అందుకే చాలామంది కవితల్లో వీటి ప్రస్తావన ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అనేక కావ్యాల్లో మోదుగ పూలు గురించి చెప్పారు కవులు దాశరథి రంగాచార్యులు రాసిన ఒక నవలకు ....మోదుగు పూలు.... అనే పేరు కూడా పెట్టారు. మోదుగ వేర్ల నుంచి నార వస్తుంది. దాంతో వాళ్లు తయారుచేస్తారు. ఈ మోదుగ చెట్ల నుంచి లక్క కూడా వస్తుంది. ఆదిలాబాద్ లో ఈ చెట్లు ఎక్కువగా ఉండడంతో లక్క సీకరిస్తున్నారు.

Also Read : ఎలాంటి నిరసనలు, సంతాపాలకు ఏ కలర్ రిబ్బన్ పెట్టుకోవాలో..? 

పూల నీళ్లు : ఒకప్పుడు హోలికి మోదుగ పూలతో తయారు చేసే రంగులనే చల్లుకునేవాళ్లు.. హోలీకి పది రోజుల ముందే అడవికి వెళ్లి పూలు తీసుకొచ్చేవాళ్లు. తర్వాత  ఎండబెట్టి దాచుకునేవాళ్లు. తర్వాత నీళ్లలో నానబెట్టి హోలీ ముందురోజు బాగా ఉడకబెడతారు. దీంతో నీళ్లు ఎర్రగా మారుతాయి. తర్వాత ఇందులో నుంచి పూలను తీసీ రంగు నీళ్లను సీసాల్లో పోసుకుంటారు. ఈ రంగునీళ్లు చల్లుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు దావు. కానీ ఇప్పుడు ఈ రంగు నీళ్లను తయారు చేసేవాళ్లు చాలా తక్కువయ్యారు. కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మాత్రమే మోదుగపూల రంగులను ఉపయోగిస్తున్నారు. 

ప్రస్తుతం హైటెక్​ యుగంలో అందరూ మార్కెట్ లో రెడీమేడ్ గా దొరుకుతున్న రసాయనాల రంగులనే ఎక్కువగా వాడుతున్నారు. కానీ వాటిని వాడడం వల్ల అనేక చర్మసంబంద వ్యాధులు వస్తాయి. ఈ మోదుగపూల రంగును గతంలో చిత్రకారులు బొమ్మలు వేయడానికి కూడా ఉపయోగించే వాళ్లు. 

ఆరోగ్యం :  మోదుగపూలలోనే కాదు ఆకులు, గింజల్లో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటిని ఆయుర్వేదం ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మోదుగు గింజలను మెత్తగా మారి తెల్లమచ్చలున్న చోట రాస్తే తగ్గుతాయి. మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. 

మోదుగచెక్క రసం గాయాలపై పూస్తే త్వరగా నయమవుతాయి. మోదుగ గింజలను పొడి చేసి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉండే ఏలిక పాముల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. 

గోరువెచ్చని మోదుగ ఆకుల కషాయాన్ని నోటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా ఒక్కటేమిటి మోదుగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు.

శివుడికి ఎంతో ప్రీతి

మోదుగుపూలు శివుడికి ఎంతో ప్రీతి, మోదుగు పూలతో పరమేశ్వరుడిని పూజిస్తారు.మోదుగు పూలనే కాదు కొమ్మలను కూడా పూజల్లో వాడతారు.  హోమాలు.. యఙ్ఞాలు చేసేటప్పుడు ఎండిన మోదుగు కొమ్మలను అగ్నిదేవుడికి సమర్పిస్తారు.  వీటిని కాల్చడం... వాటి ద్వారా వచ్చిన భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటే చాలామంచిదని భావిస్తారు. . .