ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..

ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..

ముక్కోటి ఏకాదశి రోజున న వేకువజామునే లేచి, తలారా స్నానం చేసి.. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ? ఎందుకు ఈరోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువులు ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా శ్రద్ద చూపుతారు.  పండుగలకు.. విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక ఏకాదశి రోజుల్లో విష్ణు సంబంధమైన ఆలయాలను సందర్శిస్తారు.  ఇక ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పనక్కరలేదు. ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10న వచ్చింది.  ఆరోజున దాదాపు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు.  అంతే కాదు దగ్గరలో పుణ్య నదులు ఉంటే వాటిలో స్నానమాచరిస్తారు.  అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. 

సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్య కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని పండితులు  చెబుతున్నారు. సూర్యుడు  మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది.  దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు.  ఆ రోజున అంటే 2025 జనవరి 10 వ తేదీన వైష్ణవ సంబంధ ఆలయాల్లో తెల్లవారుజామునే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటారు.

Also Read :- భక్తి అంటే ఏంటీ..

పురాణాల ప్రకారం మహావిష్ణువు గరుడ వాహనంపై  మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తుల కోర్కెలను తీరుస్తారు. అందుకే ఈ ఏకాదశిని  ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏరాదశులతో సమానమని పండితులు చెబుతారు. క్షీర సముద్రాన్ని మథించేటప్పుడు .. ఈ రోజునే హాలాహలం.. అమృతం పుట్టాయ ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది.  పరమేశ్వరుడు.. హాలాహలం మింగి కంఠం దగ్గర ఉంచుకోగా... అమృతాన్ని దేవతలు అందరూ పంచుకున్నారు.  అప్పటి నుంచి పరమేశ్వరుడి నీలకంఠేశ్వరుడు అని కూడా పిలవడం మొదలు పెట్టారు.  

విష్ణు పురాణం .. ప్రకారం.. మహా విష్ణువు ఆ రోజున వైకుంఠ ద్వారాలను తెరిచాడని పండితులు చెబుతున్నారు.  ఇద్దరు రాక్షసులు.. మహా విష్ణువును దర్శించుకొనేందుకు ఎంతో కాలంగా ఆ ద్వారాల దగ్గర వేచి యున్నారట.   ఆ రాక్షసులు పూర్వ జన్మలో చేసిన పాపాల వలన రాక్షసులుగా జన్మించారు.  ఆ రాక్షసులు తమ పాపాలను నివృత్తి చేసి.. వైకుంఠ ప్రవేశం కల్పించాలని  విష్ణుమూర్తిని కోరారు.  అప్పుడు పుష్యమాసం ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరిచి.. వారికి ముక్తిని ప్రసాదించాడట.  అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ( జనవరి 10)  వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు.