హిందువులు ఏ పని ప్రారంభించాలన్నా.. ముంచిరోజు కోసం పండితులను సంప్రదిస్తారు.అలా పండితులు చెప్పిన రోజు చాలా ప్రత్యేకమే.. అయినా ఏకాదశి తిథి రోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఆ రోజు వచ్చిదంటే కొంతమంది ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. . .. ఇక ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పనక్కరలేదు, పుష్యమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. క్రోధి నామ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ( 2025 జనవరి 10) వచ్చింది.
హిందువులు ముక్కోటి ఏకాదశిని చాలా విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు, ఆరోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున చేసే పూజలకు శ్రీమన్నారయణుడు.. ఎంతో ప్రీతి చెంది కోరిన కోర్కెలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజు ( జనవరి 10) ఎంత ఒత్తిడిలో ఉన్నా... ఎంత కష్టంలో ఉన్నా.. విష్ణుమూర్తని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు.
బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసురశక్తులపై విజయాన్ని సాధించటానికి శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠ ఉత్తరద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతాసమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి.
ముక్కోటి ఏకాదశిని ..హరి ఏకాదశి...మోక్ష ఏకాదశి....సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి.. సూర్యుడు కుడికన్ను కాగా చంద్రుడు ఎడమకన్నుగా ప్రకాశిస్తారు. విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా భగవత్ చైతన్యం, ఈశ్వర తత్త్వం ఒక్కటే. అసురశక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని, సానుకూల శక్తుల్ని పెంపొందింప జేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుకృపను సాధించి మనోభీష్టాల్ని నెరవేర్చుకున్నారు.
మురుడు అనే రాక్షసుడు ముక్కోటి దేవతలను నానా రకాలుగా హింసించుచున్న సమయంలో .. విష్ణుమూర్తి దగ్గరకు దేవతలు అందరూ కలిసి వెళ్లారు. ఆ రాక్షసుడికి ప్రత్యేక వరాలు ఉండటం వలన.. విష్ణుమూర్తి యుద్దంలో అలసిపోయి.. సింహవతి అనే గుహలో సేద తీరే సమయంలో యోగ నిద్రలోకి వెళతాడు. ఈ విషయాన్ని గమనించిన మురుడు.. మారు రూపంతో విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నించాడు. అప్పుడు పుష్యమాసం శుక్ల పక్ష్ ఏకాదశి రోజున విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి వెలువడి ..అది ఆ రాక్షసుడిని హతమార్చింది. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక, తన రాజ్యంలో అందరిచేత నిర్వహింపజేసి, శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణుపురాణం వివరిస్తుంది.