
- ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ డే
భారతదేశం స్వతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ విధానంపై ‘రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు’లో సుదీర్ఘమైన, విమర్శనాత్మకమైన చర్చ జరిగింది. అనేక మంది సభ్యులు బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసుల పనితీరుపై విమర్శలు చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ ఆనాటి ఉప ప్రధానమంత్రి, హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ పాలనలో సివిల్ సర్వీసులు నిర్వహిస్తున్న పాత్రను ప్రశంసించడమే కాక ఆ విధానాన్ని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.
సివిల్ సర్వీసులను సర్దార్ పటేల్ 24 క్యారెట్ల బంగారంగా అభివర్ణించారు. ఏ దేశ ప్రభుత్వ పాలనలోనైనా రాజకీయ కార్యనిర్వహణ అధికారులు, శాశ్వత కార్యనిర్వహణ అధికారులు ప్రముఖ పాత్రను పోషిస్తారు. రాజకీయ కార్యనిర్వహణ అధికారులను ప్రజలు నియమిత కాలం కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి, మంత్రులు, మేయర్లు తదితరులు రాజకీయ కార్యనిర్వాహకుల కోవకు చెందుతారు.
యోగ్యత ఆధారంగా నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వత కార్యనిర్వహణాధికారులు. ప్రభుత్వ ఉద్యోగులను ‘సివిల్ ఉద్యోగులని, ‘ఉద్యోగిస్వామ్యం’ అని పిలుస్తారు. సివిల్ ఉద్యోగులు లేని దేశం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. వీరు అమెరికాలాంటి పెట్టుబడి ఆర్థికవ్యవస్థ ఉన్న దేశాలలోనూ, చైనా వంటి కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలలోనూ ఉంటారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సివిల్ ఉద్యోగులు పాలనలో ప్రముఖ భూమికను పోషిస్తున్నారు.
సివిల్ సర్వీసులు 3 రకాలు
భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించారు. 1) కేంద్ర సర్వీసులు 2) రాష్ట్ర సర్వీసులు 3) అఖిల భారత సర్వీసులు. కేంద్ర సర్వీసులకు చెందినవారు వారి సేవలను కేంద్ర ప్రభుత్వానికి అందించగా, రాష్ట్ర సర్వీసులకు చెందినవారి సేవలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. అఖిల భారత సర్వీసులకు చెందినవారు తమ సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. ప్రస్తుతం మన దేశంలో మూడుఅఖిల భారత సర్వీసులు ఉన్నాయి. అవి:
- 1) భారత పాలన సర్వీను (IAS)
- 2) భారత పోలీసు సర్వీసు (IPS)
- 3) భారత అటవీశాఖ సర్వీసు (IFS)
మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను రూపొందిస్తాయి. వీటిని అమలుపరచవలసిన ప్రధాన భాధ్యత సివిల్ సర్వీసు ఉద్యోగులది. ప్రభుత్వ కార్యక్రమాలను అమలుపరచడంతో పాటు, ఉన్నతస్థాయి ఉద్యోగులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు నిష్పక్షపాతంగా తమ సలహాలను ఇవ్వాలి.
సమాచార హక్కు చట్టంతో పారదర్శకత
2005వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. సమాచార హక్కు చట్టం అమలులోనికి వచ్చిన తర్వాత సివిల్ ఉద్యోగులు ప్రజలకు తమ విధి నిర్వహణకు సంబంధించి జవాబుదారీ వహిస్తున్నారు. ఈ చట్టం వలస సివిల్ సర్వీసుల పనితీరులో కొన్ని సకారాత్మక మార్పులు వచ్చాయి.
ప్రభుత్వ పాలనలో రహస్యం స్థానంలో పారదర్శకత పెరిగింది. లంచగొండితనం, పాలనలో అలసత్వం కొంతమేర తగ్గింది. సమాచార హక్కు కారణంగా తప్పు చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారు అన్న భావన సివిల్ఉద్యోగులలో కలిగింది. సివిల్ ఉద్యోగుల పనితీరు మదింపు ఎప్పుడూ సమస్యే. వీరి పనితీరు మదింపునకు సంబంధించిన వార్షిక నివేదికలను పై స్థాయి అధికారులు తయారుచేస్తారు. చాలా సందర్భాలలో వీరు ఈ నివేదికలను నిష్పక్షపాతంగా రూపొందిస్తారు అన్న నమ్మకం లేదు. రెండవ పాలనా సంస్కరణలు సూచించినట్లు సివిల్ సర్వీసుల పనితీరు మదింపు మరింత బాధ్యతాయుతంగా, పక్షపాత రహితంగా జరగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 360 డిగ్రీల పనితీరు మదింపు సూచించారు.
సివిల్ సర్వీసు ఉద్యోగులకు ప్రత్యేకమైన విధులను నిర్వహించడానికి అవసరమైన పరిజ్ఞానం కానీ, నైపుణ్యం కానీ లేవు. ఈ కారణంగా అవసరాలకు అనుగుణంగా మధ్య స్థాయి, ఉన్నతస్థాయి ఉద్యోగాలలో అనుభవజ్ఞులను నేరుగా ప్రైవేట్ సంస్థల నుంచి నియమించుకునే వెసులుబాటు ఉండాలి. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి ఆస్కారం లేకుండా సేవలందించడం సివిల్ సర్వీసెస్ ఆశయం.
రాజకీయ తటస్థ విధానం
సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులు రాజకీయ తటస్థ విధానం ఆధారంగా తమ విధులను నిర్వహించాలి. వీరు ఏ రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉండరాదు. వీరికి ఉన్న ఒకే ఒక్క రాజకీయ హక్కు ఓటువేసే హక్కు. అధికారంలో ఉన్న పార్టీ విధివిధానాలను సివిల్ ఉద్యోగులు అమలు చేయాలి. సివిల్ ఉద్యోగుల రోజువారీ విధులలో రాజకీయ కార్యనిర్వహణాధికారులు జోక్యం చేసుకోరాదు. దురదృష్టవశాత్తు ఈ రకంగా జరగడం లేదు.
రాజకీయ కార్యనిర్వహణాధికారులు సివిల్ ఉద్యోగుల పోస్టింగ్ విషయంలో, పదోన్నతుల విషయంలో సామర్థ్యం కంటే వారికి విధేయులుగా పని చేసేవారికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ పాలనలో అసమర్థత పెరుగుతోంది. సివిల్ ఉద్యోగులకు పదోన్నతి సక్రమంగా జరగాలంటే పక్షపాత రహితమైన సివిల్ సర్వీసు బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ రకంగా చేయడం వలన ఉద్యోగుల సుస్థితి, సామర్థ్యం పెరుగుతోంది. సివిల్ సర్వీసుల సంస్కరణల గురించి చర్చించినప్పుడు వారిని ఏ రకంగా ప్రజలకు జవాబుదారీ వహించేలా చేయాలి అనే అంశంపై దృష్టి సారించాలి. భారత పార్లమెంటరీ విధానంలో సివిల్ ఉద్యోగులు ప్రత్యక్షంగా వారి విధి నిర్వహణకు సంబంధించి ప్రజలకు జవాబుదారీ వహించరు. వీరు సంబంధిత శాఖ మంత్రులకు జవాబుదారీ వహిస్తారు. ప్రభుత్వ పాలనలో రాజకీయ జోక్యం పెరగడానికి ఇది ఒక కారణం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే పౌరహక్కుల చట్టాన్ని (citizen charter) సామాజిక తనిఖీ (social audit) వంటి విధానాలను మరింత బలోపేతం చేయాలి.
- డా. పి. మోహన్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్-