డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..

డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..

మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టం.. సహజంగా ప్రతి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని పూజిస్తారు.  ఆరోజు ఉపవాసం ఉంటారు. ఇక మార్గశిర మాసం .. కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు.   ద్రుక్ పంచాంగం ప్రకారం  ఈ ఏడాది 2024 సఫల ఏకాదశి డిసెంబర్ 26న వచించింది. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. సఫల ఏకాదశి ఉపవాసం ఒక వ్యక్తికి తెలిసో తెలియకో చేసిన పాపాల నుండి విముక్తి కలిగిస్తుందని, విజయానికి మార్గం తెరుస్తుందని నమ్ముతారు.

పండితులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 26 సఫల ఏకాదశి రోజున నారాయణుడిని పూజించాలి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సఫల ఏకాదశి వ్రత మహత్మ్యాన్ని ధర్మారాజుకు చెప్పాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.  సఫల ఏకాదశి రోజున ఉపవాసం పాటించి.. లక్ష్మీ నారాయణులను పూజించిన వారు  జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు భజనలు , కీర్తనలు పఠించడం, దానధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు. అలాగే ఈ రోజున అన్నదానం, ధనాన్ని దానం చేయడం వలన సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం. ప్రతి ఏకాదశికి దాని సొంత పేరు, ప్రాముఖ్యత ఉంది.మరణానంతరం విష్ణు సాన్నిధ్యానికి అనగా వైకుంఠ ధామం పొందుతారు. 


ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా తెలిసీ తెలియక చేసిన పాపాలన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనదనా పండితులు చెబుతుంటారు. 

సఫల ఏకాదశి పూజా విధానం

  • బ్రహ్మ ముహూర్తానికి ముందే  నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
  • లక్ష్మీనారాయణుల చిత్ర పటాన్ని.. పసుపు.. కుంకుమ.. గంధంతో అలంకరించుకోవాలి.  
  • స్వామివారి ఎదురుగా ఆవునెయ్యితో కాని... నువ్వుల నూనెతో కాని దీపారాధన చేయాలి.  దీపారాధాన చేసే కుందిలో మూడు ఒత్తులు చేయాలి.
  •  ఆ తరువాత విష్ణుమూర్తిని పూలతో .. తులసి దళాలతో  పూజించాలి..
  • ఉపవాస దీక్షను పాటించండి.
  • ఓంనమోభగవతే వాసుదేవాయ నమ:  .. ఓం నమో నారాయణాయ నమ: అనే మంత్రాలతో పూజించాలి.
  • తరువాత విష్ణుమూర్తికి పాయసం.. పులగం  నైవేద్యాన్ని సమర్పించి..  పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి.
  • విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.. అవకాశం లేకపోతే వినండి,  
  •  సఫల ఏకాదశి పూజను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చని పండితులు తెలిపారు.
  •  రోజంతా పండ్లు తినాలి. రాత్రి మేల్కొని జాగారం చేయాలి
  • నిరుపేదలకు దానం చేయండి. పేదలకు ఆహారం అందించండి. ఇలా  చెయ్యడం వల్ల చాలా రోజులుగా పెండింగ్ ఉన్న పనులు అవ్వాలంటే ఈ రోజు దానధర్మాలు చెయ్యడం మంచిదంటున్నారు పండితులు.
  • సఫల ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి మోక్షం లభిస్తుంది.

సఫల ఏకాదశి పురాణ కథ 


పూర్వం చంపావతి నగరాన్ని మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుంభకుడు అనే కుమారుడు ఉండేవాడు. అధర్మాన్ని పాటిస్తూ ప్రజల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అది తెలుసుకున్న రాజు కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అడవుల పాలైన లుంభకుడు ఆహారం దొరకపోవడంతో ఒక చెట్టు కింద పడుకున్నాడు. తనకి పట్టిన పరిస్థితి తలుచుకుని చింతిస్తూ రోజంతా ఏమి తినకపోవడంతో స్పృహ తప్పి పోయాడు.

ఆరోజు ఏకాదశి కావడంతో తనకి తెలియకుండానే అతడు ఉపవాసం పాటించినట్టు అయ్యింది. విష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ధర్మబద్ధమైన పాలన చేసిన లుంభకుడు మరణానంతరం విష్ణు లోకాన్ని చేరుకున్నాడని పురాణ గాథ. ఈ ఏకాదశి వ్రత మహత్యం గురించి శివుడు పార్వతీ దేవికి చెప్పినట్టు పద్మ పురాణం చెబుతోంది. అందుకే సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేస్తే విష్ణు లోక ప్రవేశం ఉంటుంది. సంపద, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు