పుష్యమాసం.. కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించి కొన్ని నియమాలు పాటిస్తే పితృశాపం తొలగి.. జీవితం ఆనందదాయకంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశిని షట్ తిల ఏకాదశి అంటారు.. క్రోధి నామ సంవత్సరంలో (2025) లో షట్ తిల ఏకాదశి ఎప్పుడు వచ్చింది.. ఆరోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. .
హిందూ పంచాగం ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి. ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తిని.. లక్ష్మీ దేవిని పూజించి ఉపవాస దీక్షను పాటాస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. పుష్యమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్ తిల ఏకాదశి, విమలైకా దశి, సఫలైకాదశి, కల్యాణ ఏకాదశి అని పిలుస్తారు. సహజంగా పుష్యమాసం శని భగవానుడికి చాలా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలండర్ ప్రకారం క్రోధినామ సంవత్సరంలో ( 2025) శనివారం .. జనవరి 25న వచ్చింది. ఏకాదశి తిథి జనవరి 24న రాత్రి 7.25 గంటలకు ప్రారంభమై... జనవరి 25 రాత్రి 8.31 వరకు ఉంది. ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకొని షట్ తిల ఏకాదశిని జనవరి 25 న జరుపుకుంటారు.
చాలా మంది అనేక సమస్యలు.. ఈతి భాధలతో ఇబ్బంది పడుతుంటారు. చాలామందికి పెళ్లి సంబంధాలు కుదిరినట్టే కుదిరి ఏవేవో ఆటంకాలు ఏర్పడుతాయా. ఇంకా ఎంత కష్టపడినా ఎదుగుదల లేకపోవడం.. ఉద్యోగంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతుంటాయి. అదే విధంగా ఎంత టాలెంట్ ఉన్నా జాబ్ రాకపోవడం.. దుర్భర జీవితం గడుపుతుంటారు. ఇలాంటివి అన్ని పితృ దేవతల శాపం వలన జరుగుతాయని పండితులు చెబుతున్నారు. షట్ తిల ఏకాదశి రోజున ( జనవరి 25) కొన్ని పరిహారాలు పాటిస్తే పితృదేవతల శాపం నుంచి విముక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
షట్ తిల ఏకాదశి (జనవరి 25) రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. షట్ అంటే ఆరు, తిల అంటే నువ్వులు ఆ రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. శ్రీమన్నారామణునికి, పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణాలు వదలడం అనాది నుంచి ఆచారంగా వస్తున్నది.
- తిలాస్నానం : నువ్వుల నూనె వంటికి రాసుకుని, నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.
- తిల లేపనం : స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించాలి.
- తిల హోమం : ఇంటిలో తిల హోమం నిర్వహించాలి.
- తిలోదకాలు : పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం.
- తిలదానం : నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.
- తిలాన్నభోజనం : నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది).
ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతున్నారు. మరి నువ్వుల అన్నం తినడం ఏమిటి అనే అనుమానం సహజంగా వస్తుంది.
నువ్వులతో తయారు చేసిన అన్నాన్ని దేవుడికి నివేదన చేసి, అందరికి ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారాయణ తరువాత దానిని తినాలి.
ఆ రోజున( జనవరి 25) తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 25న చేసే పరిహారాలు షట్ తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు, మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి.