వైష్ణవాలయాలలో పురాతనమైంది.శ్రీరంగం, దీనిని పెరియకోయిల్ అని కూడా అంటారు. కోయిల్ అన్న పదాన్ని ఈ దేవాలయానికే వాడతారు. 156 ఎకరాల్లో ఉన్న ఈ ఆలయంలో ఏడు ప్రాకారాలు ఉన్నాయి. అంతేకాదు 21 గోపురాలతో అంత్యంత సుందరంగా విరాజిల్లుతోంది. ఈ గుడి తమిళనాడులోని తిరుచ్చికి దగ్గర్లో కావేరీ ఉపనదుల మధ్య చిన్న దీవిలో ఉంది.
శ్రీరంగాన్ని ఇండియన్ వాటికన్ గా చెప్తారు. ప్రపంచంలోనే పూజాదికార్యక్రమాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదే. ఆళ్వారుల ప్రబంధాలకు, రామానుజుని శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ఈ ఆలయం ప్రసిద్ధి. శ్రీరంగ పట్టణంలో దేవాలయం లేదు. ఈ ఆలయంలోనే శ్రీరంగపట్టణం ఉంది. శ్రీరంగనాథుడు.. రంగనాయికి అమ్మవారిని పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు సేవించి తరించారని చెప్తారు..
ALSO READ : ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
పురాణకథ
పురాణాల ప్రకారం ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే, బ్రహ్మ తాను ఆరాధించే శ్రీరంగనాథుని ఆ మహారాజుకు ఇస్తాడు. అప్పటి నుంచి శ్రీరాముడి వరకు ఆ పరంపర కొనసాగింది. అయితే రాముడి పట్టాభిషేకం తర్వాత విభీషణుడు రాముడి ఎడబాటును భరించలేక ప్రార్థిస్తే శ్రీరంగనాథుడిని అతడికి ఇస్తాడు శ్రీరాముడు. విభీషణుడు కావేరీ తీరానికి వచ్చే సరికి సంధ్యావందన సమయం అవుతుంది. దాంతో శ్రీరంగనాథుడిని అక్కడ ఉంచి, సంధ్యావందన చేస్తాడు విభీషణుడు. తిరిగి వచ్చే సరికి, శ్రీరంగనాథుడు అక్కడే ప్రతిష్ట అయి ఉంటాడు. విభీషణుడు బాధపడితే రాత్రివేళల్లో పూజలందుకుంటానని మాట ఇస్తాడు. గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని పెరియ పెరుమాళ్ అని, ఉత్సవ విగ్రహాన్ని నంబెరుమాళ్ అని పిలుస్తారు.
ఆలయ ప్రత్యేకత
ఈ దేవాలయంలో విష్ణుమూర్తి పక్కకు తిరిగి ఆదిశేషుడిపై పడుకుని ఉంటాడు. ఈ గుడిని పూర్తిగా ద్రవిడ శైలిలో నిర్మించారు. చోళరాజుల భక్తికి, ఆనాటి శిల్పకళకు ఈ ఆలయం గొప్ప ఉదాహరణ. ప్రధాన ద్వారం 237 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకా 50 దేవతా విగ్రహాలు. కోనేరు అత్యంత సుందరంగా కనువిందు చేస్తాయి. గర్భగుడి పైభాగం విమాన ఆకారంలో ఉండటం ఈ గుడి ప్రత్యేకత. ఈ ప్రాంగణంలో థాయార్ చక్రథజవార్, ఉడయవార్, గరుడాల్వార్, ధన్వంతరి, హయగ్రీవర్... సన్నిధానాలను భక్తులు ఆనందంతో దర్శించుకుంటారు.
ALSO READ : ధనుర్మాసం: తిరుప్పావై 23వ పాశురం ..గోపికల కష్టాలను తీర్చిన కృష్ణుడు
తూర్పున ఉన్న గోపురంలో స్వామివారిని ప్రతిష్టించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఈ గర్భగుడి ఆలయానికి మూలస్థానం. ఎనిమిదవ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్య పార్థివదేహాన్ని కూడా ఆ ప్రాంగణంలోనే భద్రపరిచారు. ఆరోగ్య కారకుడైన ధన్వంతరి ఆలయం కూడా ఇక్కడ ఉంది. గర్భగుడి ఎదురుగా బంగారు స్తంభాలు న్నాయి. వీటిని తిరుమణై త్తూణ్ అంటారు.
గోదాదేవి
తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తులకు గోదాదేవి తులసి తోటలో దొరుకుతుంది. ఆమె ప్రతిరోజూ తులసి ఆకులతో దండలు కట్టి శ్రీకృష్ణుడిని పూజిస్తుంది. అయితే గోదాదేవి తాను కట్టిన మాలలను మొదట తానే వేసుకుని, తర్వాత పూజారులకు ఇచ్చేది. ఒకరోజు ఆ దండలకు వెంట్రుకలు ఉండటం చూస్తారు. పూజారులు. తప్పు జరిగిందని బాధపడతారు. అయితే స్వామి వాళ్లతో నాకు గోదాదేవి అలంక రించుకున్న మాలలంటేనే ఇష్టం అని చెప్తాడు. గోదాదేవి శ్రీరంగనాథుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
ముప్పై రోజులపాటు తిరుప్పావై పాశురాలతో రంగనాథుడిని కీర్తిస్తుంది. రంగనాథుడే గోదాదేవి తండ్రి విష్ణుచిత్తునికి కలలో కనిపించి గోదాదేవిని పెళ్లి కూతురుగా అలంకరించి తన ఆలయానికి తీసుకరమ్మని చెప్తాడు. చివరకు గోదాదేవి ఆలయంలో స్వామివారిని అర్చిస్తూ ఆ దేవుడిలోనే అంతర్లీనమయిందని అంటారు. అందుకే ఈ ఆలయంలో గోదాదేవి, రంగనాథుల వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ALSO READ : ముక్కోటి ఏకాదశి.. ముక్తి దాయకం.. క్షీర సముద్రం నుంచి అమృతం పుట్టిన రోజు ఇదే..
'వైజ్ఞానికంగా ఎంతో ముందున్నాం' అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా కట్టారో అంతుచిక్క డం లేదు. ఈ గుడిలో ఉన్న వెయ్యికాళ్ల మం డపాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఎంతమంది శిల్పులు, ఎన్ని రోజులు, ఎలా కట్టారో...! రాళ్లను ఎలా తరలించారో...! చె ప్పలేరు. ధనుర్మాసంలో ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవాలు నిర్వ హిస్తారు. ఈ నెలలోనే శ్రీరంగనాథుడిని పది లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని స్థానికులు చెప్తారు. ఏదాదిలో 322 రోజులు ఇక్కడ ఏదో ఒక పూజాకార్యక్రమం జరుగుతూనే ఉంటుంది
–వెలుగు, లైఫ్–