Sivaratri 2025: తెలంగాణలో త్రికూట( త్రిమూర్తుల) ఆలయం.. వాల్గొండలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు..

Sivaratri 2025: తెలంగాణలో త్రికూట( త్రిమూర్తుల) ఆలయం.. వాల్గొండలో  వైభవంగా శివరాత్రి ఉత్సవాలు..

త్రిమూర్తులు ఒకేచోట కొలువైన క్షేత్రాలు దేశంలో చాలా అరుదు. అలాంటి వాటిల్లో వాల్గొండ త్రికూటాలయం ఒకటి. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య గోదావరి నదీ తీరాన వెలసిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికతో పాటు ప్రకృతి అందాలకూ నెలవు. శ్రీరాముడు కొలువైన ఈ ఆలయంలో శివుడితో పాటు బ్రహ్మ కూడా లింగరూపంలో పూజలందుకోవడం విశేషం.  మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలో ఈ ఆలయం ఉంది. 

త్రేతా యుగంలో శ్రీరాముడు సీతకోసం అన్వేషిస్తూ గోదావరి తీర ప్రాంతంలో తిరిగాడు. వశిష్టుని పరంపరలో వాలకీయ మహర్షి ఆశ్రమంగా ఉంది నేటి వాల్గొండ. ఈ నేపథ్యంలో శ్రీరాముడు వాల్గొండలో కొన్నాళ్లు ఉన్నాడని ప్రతీతి. ఈ ఆశ్రమంలో సేద తీరుతున్న రాముడు శివున్ని ఆరాధించాడు. పక్కనే ఉన్న గోదావరి నది తీరంలో సైకత శివ లింగాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు తిరుగు ప్రయాణమైన తర్వాత శివలింగ సంరక్షణను అక్కడున్న మహర్షులు తీసుకున్నారు. ఇలా శివుడికి పూజలు జరిగాయి. ఆ మహర్షుల జీవసమాధులు నేటికి వాల్గొండలో కనిపిస్తాయి. కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని అక్కడి రాజులు గుర్తించారు. శివలింగం ఉండటంతో పాటు రాముడు నడయాడిన నేల కావడంతో శివలిం గాన్ని యధాతథంగా ఉంచి.. రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వాత కాకతీయులు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయుల రాజ చిహ్నాలైన పద్మాలు, హంసలు, సింహాల గుర్తులు ఇక్కడ కనిపిస్తాయి. నిర్మాణ శైలి కొంత వరకు ఉత్తర భారతదేశపు శైలి ఉంటుంది. 

Also Read:-శివరాత్రి రోజు ఈ తప్పులు చేశారా.. ఇక ఈ జన్మకు పెళ్లికాదు..

శివయ్యకు ప్రత్యేక పూజలు 

త్రికూటాలయంలో శివ లింగానికి విశేషపూజలు, ఏకాదశ మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, తులసి కల్యాణంతో పాటు లక్షదీపోత్సవం నిర్వహిస్తారు. శివరాత్రి రోజు విశేషంగా జాతర నిర్వహిస్తారు.  గ్రహదో షాలు తొలగిపోవడానికి నవగ్రహ హోమాలు చేస్తారు. సంతానం లేని దంపతులు ఇక్కడికొచ్చి స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగు తుందని భక్తుల నమ్మకం. ప్రతి సోమవారం అన్నపూజ, శివరాత్రి పర్వదినాన శివపార్వతు లకు కల్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. 

ప్రత్యేకత 

 శివ, కేశవులతో పాటు బ్రహ్మ కూడా ఒకేచోట కొలువైన వాల్గొండ త్రికూటాలయ రామలింగేశ్వరస్వామి దర్శనం ఫలప్రదం.  ఈ ఆలయ విశిష్ఠతల్లో ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పుకొనేది ముక్కోటి ఏకాదశిన మాత్రమే సూర్య కిరణాలు నేరుగా శివలింగాన్ని తాకడం. సూర్కో దయం అయిన ఒక్క గడియ తర్వాత ఈ అద్భుత ఘట్టం కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆ రోజు భక్తులు భారీగా తరలివస్తుంటారు.. ఇలాంటి నిర్మాణ శైలి ఉన్న ఆలయాలు ఈ చుట్టుపక్క మరెక్కడాకనిపించవు. అంతేకాదు గోదావరి నదీ తీరంలో ఉత్తరాభిము ఖంగా ఉన్న త్రికూటాలయాల్లో ఈ ఆలయం మొదటిగా చెబుతారు. 

ఎలా వెళ్లాలి? 

త్రికూటాలయాన్ని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా జగిత్యాల, నిజామాబాద్​ రూట్లలో మెట్​పల్లి చేరుకునేందుకు బస్సు సౌకర్యం ఉంది. మెట్​పల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా వాల్గొండ చేరుకోవచ్చు. బస్సు, ఆటోవంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.సికింద్రాబాద్, కాచిగూడల నుంచి నిజామాబాద్ మీదుగా మెట్​పల్లికి ప్రతి రోజు ప్యాసింజర్​ రైలు ఉంది.

దర్శనీయ ప్రాంతాలు 

ఆలయ శివారులో మఠంగుడి(వాలకీయ మహర్షి ఆశ్రమం) ని దర్శించవచ్చు. మహర్షుల జీవ సమాధులు చూడొచ్చు. హనుమత్ పీఠానికి మూల కేంద్రంగానూ ఉంది. ఏటా రెండు, మూడు వేల మంది హనుమాన్ భక్తులు ఇక్కడ దీక్షలు తీసుకుంటారు. ఆలయం గోదావరి నదీ తీరంలో ఉండటంతో పుణ్యస్నానాలు చేయొచ్చు. దీంతో పాటు వాల్గొండకు రెండు కిలో మీటర్ల దూరంలో పాతదాం రాజ్​ పల్లి లక్ష్మీనర్సింహ స్వామి గుట్ట, కొత్త దాంరాజ్​ పల్లి కనకసోమేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. 

-వెలుగు, లైఫ్​–