వినాయకచవితి పండుగ వెనుకున్న పరమార్థం ఇదే..

వినాయకచవితి పండుగ వెనుకున్న పరమార్థం ఇదే..

సెప్టెంబరు 07 న వినాయక చవితి. ప్రతి ఇంట్లో వినాయకుడు కొలువుతీరుతాడు.. మండపాల్లో భారీ గణపయ్యలు పూజలందుకుంటారు. ఇంతకీ ఆ రూపం వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసా...

వినాయక చవితి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకుని గంగమ్మ ఒడికి చేరుతాడు గణనాథుడు. ఆ తొమ్మిదిరోజులు ఊరూవాడా సంబరమే...చిన్నా పెద్దా అందరూ భాగస్వాములే. సాధారణంగా పండుగ అంటే ప్రతి ఇంటా ఉత్సాహం వెల్లివిరుస్తుంది. సాధారణంగా పండుగ అంటే ప్రతి ఇంట్లో ఉత్సాహాన్ని నింపుతుంది..వాస్తవానికి ఉత్సాహం మాత్రమే కాదు మార్పు మొదలవ్వాలి. భక్తిశ్రద్ధలతో పూజలు చేయడమే కాదు..ఆ రూపం వెనుకున్న ఆంతర్యం తెలుసుకోవాలి..ఏం నేర్చుకోవాలి? ఎలాంటి మార్పులు రావాలో నేర్చుకోవాలి, పిల్లలకు తెలియజేయాలి.  

ALSO READ | భాగ్యనగరంలో వినాయకచవితి సందడి.. మట్టి విగ్రహాలకే పూజలు చేయండి..

బొజ్జ గణపయ్య, లంబోదరుడు, వినాయకుడు, గణనాథుడు, పార్వతీ తనయుడు ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఆ రూపం వెనుక ఎంతో తాత్వికత ఉంది. సాధారణంగా వినాయకుడు అనగానే పెద్ద పొట్ట, పెద్ద చెవులు, పొట్ట దగ్గర సర్పం, చిన్న కళ్లు, వక్రతొండం, ఎలుకవాహనం గుర్తొస్తుంది. ఇది ఆయన రూపం మాత్రమే కాదు..భక్తుల్లో ఉండాల్సిన సద్గుణాల సమ్మేళనం.  

  • పూర్ణకుంభంలా ఉన్న వినాయకుడి  దేహం పరిపూర్ణమైన ఈ జగత్తుకు నిదర్శనం 
  • పెద్దబొజ్జ అంటే భోజన ప్రియత్వం కాదు..జీవితంలో మంచి చెడులను జీర్ణించుకోవాలని ఆంతర్యం 
  • ఏనుగు తల మేధస్సుకు సంకేతం అయితే...చిన్న కళ్లు సునిశిత పరిశీలనకు గుర్తు
  • వక్రతుండం ఓంకారం ప్రణవనాదానికి సింబల్ 
  • ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం
  • మూషికం చిన్నగానే ఉన్నప్పటికీ ఎంతదూరమైనా ప్రయాణిస్తుంది..వేగంగా కదులుతుంది..పట్టుదల ఉండే ఏదైనా సాధ్యం అని చెప్పడమే 
  • వినాయకుడి 4 చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. లంబోదరుడి పొట్టచుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం..
  • చేతిలో ఉన్న పాశం, అంకుశం సన్మార్గంలో నడిపించే సాధనాలకు ప్రతీక..
  • అనవసరమైన విషయాలను చేటలా చెరిగేసి అవసరమైన మంచి సంగతులను మాత్రమే స్వీకరించాలని చేటంత చెవులు చెబుతున్నాయ్ 
  • ఎక్కువ తెలుసుకుని తక్కువ మాట్లాడాలని చెబుతోంది చిన్న నోరు
  • పార్వతీ తనయుడి చేతిలో ఉన్న గొడ్డలి ఇహలోక బంధాలను తెంచుకోమని చెప్పేందుకు సూచన  
  • గణేషుడి ప్రతి విగ్రహం చేతిలో లడ్డూ గమనించే ఉంటారుగా..వినాయకుడికి లడ్డూ అంటే అంత ఇష్టం...ఆశయాలకు అనుగుణంగా అడుగేస్తే విజయం మీ సొంతం అవుతుందని అర్థం..

తెలివితేటలకు ప్రతీకగా గణపతిని ఎందుకు చెబుతారంటే..వ్యాసమహర్షి చెబుతుండగా మహాభారతాన్ని రాసింది ఆయనే. మహాభారతం రాసేందుకు ఓ లేఖకుడి అవసరం పడింది. తాను చెబుతుంటే రాయాలని వ్యాసుడు కోరాడు. అప్పుడు గణనాథుడు స్పందించి.. వ్యాసుడికే ఓ పరీక్ష పెట్టాడు. వ్యాసుడు నిజంగా తన మనసులోంచి వచ్చిందే చెబుతున్నారో లేదో అనే ఉద్దేశంతో...మీరు ఆపకుండా చెబితే రాస్తాను అన్నాడు. ఎక్కడైతే ఆగుతారో అక్కడ కలం పక్కనపెట్టేసి వెళ్లిపోతానన్నాడు. సరే అన్న వ్యాసమహర్షి చెప్పడం ప్రారంభించారు...అక్షరం కూడా పొల్లుపోకుండా రాశాడు వినాయకుడు.