హిందువులు ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత.. ప్రాధాన్యత వేరే చెప్పనక్కరలేదు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు.. లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజా శుభ సమయం ఎప్పుడు? ఉవాస విరమణ సమయంతో పాటు.. వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. . .
హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మిదేవిలను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు. . వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం చేయడం శుభ ప్రదం అని హిందువులు నమ్ముతుంటారు.
2025లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి .. పుష్య మాసం వచ్చే శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 9, గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు.
వైకుంఠ ఏకాదశి ఉపవాసం విరమణ సమయం
వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7:15 నుంచి 8:21 వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది. శుభ ముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత
వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్య మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి, పౌష పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం, విష్ణువు, లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం.ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు. సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావంతో మంచి సంతానం పొందుతారు. అంతేకాదు పిల్లలకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది.
వైకుంఠ ఏకాదశి ( జనవరి 10) రోజున ఉపవాస దీక్షను పాటించడం వలన సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ.. వైకుంఠ ఏకాదశి రోజున, విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది. దీంతో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్దలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో.. వారు మరణానంతరం.. వైకుంఠ ధామంలో నారాయణుని పాదాల వద్ద స్థానం పొందుతాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ఉపవాసం, పూజలు ఏకాదశి రోజున తెల్లవారు జామున నిద్రలేచి గంగాజలం పోసిన నీటితో స్నానమాచరించాలి. మనస్సులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీ నారాయణున్ని పూజించాలి. విష్ణుమూర్తికి.. లక్ష్మీదేవికి ధూపం, దీపం, పుష్పాలు, అక్షింతలు, పూలమాల, నైవేద్యాన్ని సమర్పించండి. పంచామృతం, తులసిని సమర్పించండి. అనంతరం నారాయణుని మంత్రాలను జపించండి. అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి. చివరగా ఆరతి ఇస్తే..వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది. రోజంతా ఉపవాసంగా ఉండండి.. కేవలం తులసి తీర్ధం మాత్రమే తీసుకోండి. రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుని ధ్యానించండి. ద్వాదశి రోజున స్నానమాచరించి బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లు దానధర్మాలు చేయాలి. అనంతరం ఉపవాసం విరమించండి.
- ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి. కనుక జనవరి 10 న ఉపవాసం ఉండాలని భావిస్తే.. ముందు రోజు సాయంత్రం ( జనవరి 9 ) సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి.
- ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి.
- ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించండి.
- ఏకాదశి రాత్రి, జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం, భజన చేయాలి
- మీ మనస్సులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు. ఎవరినీ దూషించవద్దు , అమాయకులను వేధించవద్దు.
- ద్వాదశి రోజున, బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించండి